‘గ్రీన్‌’ పాలిటిక్స్‌! చెట్టంత ఓటు

7 Nov, 2023 13:32 IST|Sakshi

సాక్షి, తెలంగాణ: ‘గులాబీ’ పార్టీ అనగానే అందరికీ టక్కున బీఆర్‌ఎస్‌ పేరు గుర్తొస్తుంది.. ఎర్ర పార్టీలనగానే అందరూ సీపీఐ, సీపీఎం పేర్లు చెబుతారు... మరి గ్రీన్‌ పార్టీ అంటే ఏం గుర్తొస్తుందని అడిగితే మీరేమంటారు?!! ఇదేం పేరు.. మేం ఎప్పుడూ వినలేదే అని అవాక్కవుతున్నారా? మనం ఇంకా వినలేదేమోగానీ అభివృద్ధి చెందిన దేశాల్లో  పదులకొద్దీ పార్టీలు పుట్టుకొచ్చి క్రియాశీల రాజకీయాలు సైతం సాగిస్తున్నాయి! మరి ఆ పార్టీలేంటో తెలుసుకుందాం.'

గ్రీన్‌ పార్టీ అంటే...?.. : యూరప్, అమెరికా ఖండాల్లోని పారిశ్రామిక దేశాలు చాలా దశాబ్దాలుగా అ­తిగా కర్బన ఉద్గారాలను వెలువరిస్తూ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫక్తు ఆధిపత్య రాజకీయాలకే పరి­మితం కాకుండా పర్యావరణవాదం, సామాజిక నాయ్యం, అహింస తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించేందుకు పుట్టుకొచ్చిన రాజకీయ పా­ర్టీలే గ్రీన్‌ పార్టీలు. సాధారణంగా ఇవి సోషల్‌ డెమోక్రటిక్‌ ఆర్థిక వి­ధానాలను అనుసరిస్తూ వామపక్ష పార్టీలతో జత కడుతూ ఉంటాయి.

రాజకీయాలవైపు అడుగులు.. : పర్యావరణ సమస్యలపై ఉద్యమాలు చేపట్టే సంఘాలు, సంస్థలే కాలక్రమంలో గ్రీన్‌ రాజకీయ పార్టీలుగా మారుతున్నాయి. యూరప్, అమెరికా ఖండాల్లోని సంపన్న దేశాల్లో 1960వ దశకంలో రాడికల్‌ సోషల్‌ యాక్టివిస్టులు, ముఖ్యంగా విద్యార్థుల నిరసనోద్యమాలు.. 1970–80 దశకాల్లో అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమాల నుంచి తొలినాటి గ్రీన్‌ పార్టీలు ఆవిర్భవించాయి.

1972లో తొలిసారి ఏర్పాటు.. : తొలి రెండు గ్రీన్‌ పార్టీలు ఆ్రస్టేలియాలో (ద యునైటెడ్‌ టాస్మేనియా గ్రూప్‌), న్యూజిలాండ్‌ (ద వేల్యూస్‌ పార్టీ) 1972లో ఏర్పాటయ్యాయి. 1973లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో పీపుల్‌ (తర్వాత ద ఎకాలజీ పార్టీగా మారింది) పార్టీ పుట్టింది. 1979లో గ్రీన్‌ పార్టీ ఆఫ్‌ జర్మనీ రిజిస్టరైంది. 250 పర్యావరణ సంఘాలను ఏకం చేసి హెర్బర్ట్‌ గ్రూల్, పెట్రా కెల్లీ ఈ పార్టీని నెలకొల్పారు. 1983లో జాతీయ ఎన్నికల్లో ఈ పార్టీ ప్రతినిధి తొలుత గెలుపొందారు. 1998 నుంచి 2005 వరకు సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. 2021 ఎన్నికల్లో అపూర్వమైన రీతిలో 15% ఓట్లు గెల్చుకుంది.

ఉమ్మడి మేనిఫెస్టో... : 1992లో బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగరంలో జరిగిన గ్రీన్‌ పార్టీల తొలి అంతర్జాతీయ సమావేశం గ్లోబల్‌ గ్రీన్స్‌ ప్రకటనను వెలువరించాయి. ‘గ్రీన్‌ పొలిటికల్‌ పార్టీలకు ప్రజలు ఓట్లు వేసినప్పుడే పర్యావరణ సమస్యలపై ప్రభుత్వాలు సీరియస్‌గా స్పందిస్తున్నాయని అనుభవాలు చెబుతున్నాయ’ని ఈ ప్రకటన పేర్కొంది. ఈ నేపథ్యంలో 2001లో తొలి ‘గ్లోబల్‌ గ్రీన్‌ పార్టీల కాంగ్రెస్‌’ ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో జరిగింది. ‘గ్లోబల్‌ గ్రీన్స్‌ చార్టర్‌’పేరిట పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. ఆ తర్వాత 2012లో డకర్‌లో, 2017లో ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్‌లో గ్రీన్‌ పార్టీల కాంగ్రెస్‌లు జరిగాయి. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణ కొరియాలో జరిగిన కాంగ్రెస్‌లో గ్లోబల్‌ గ్రీన్స్‌ చార్టర్‌ అప్‌డేట్‌ చేశారు.

6 మూల సూత్రాలు... : పర్యావరణ పరిజ్ఞానం, సాంఘిక న్యాయం, భాగస్వామ్య ప్రజాస్వామ్యం (పార్టిసిపేటరీ డెమోక్రసీ), అహింస, సుస్థిరత, వైవిధ్యానికి గౌరవం.. ఇవీ గ్లోబల్‌ గ్రీన్‌ పార్టీలు మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు మూల సూత్రాలు. ‘భూమి జీవ శక్తి, వైవిధ్యం, సౌందర్యం మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. వీటిని అంతరింపజేయకుండా, వీలైతే మెరుగుపరిచి, మన తదుపరి తరానికి అందించడం మన బాధ్యత’అని దీని పీఠికలో తొలి వాక్యం చాటి చెబుతోంది. ‘పౌరులందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు ఉన్న ప్రజాస్వామ్యం కోసం కృషి చేస్తాం. వారి జీవితాలను ప్రభావితం చేసే పర్యావరణ, ఆర్థిక, సామాజిక, రాజకీయ నిర్ణయాలలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు’ అని చెబుతోంది.

ప్రపంచవ్యాప్తంగా 87 గ్రీన్‌ పార్టీలు.. : ‘గ్లోబల్‌ గ్రీన్స్‌’సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 87 గ్రీన్‌ పొలిటికల్‌ పార్టీలున్నాయి. ఈ పార్టీలన్నీ కలసి 2001లో గ్లోబల్‌ గ్రీన్స్‌ పేరిట సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. బ్రస్సెల్స్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో 87 గ్రీన్‌ రాజకీయ పార్టీలతోపాటు 9 పర్యావరణ సంస్థలు కూడా సభ్యులుగా ఉన్నాయి. 12 మంది సభ్యులుగల స్టీరింగ్‌ కమిటీకి బాబ్‌ హలె, గ్లోరియా పొలాంకో 2020 నుంచి కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా సురేశ్‌ నాటియాల్‌ 2019లో నెలకొల్పిన ‘ఇండియా గ్రీన్స్‌ పార్టీ’కి కూడా ఈ సమాఖ్యలో సభ్యత్వం ఉంది. గ్లోబల్‌ గ్రీన్స్‌లోని పార్లమెంటేరియన్‌ నెట్‌వర్క్‌లో ప్రపంచవ్యాప్తంగా 400 మందికిపైగా గ్రీన్‌ పార్లమెంటు సభ్యులు ఉన్నారు.

పెరుగుతున్న ఆదరణ.. : ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ముఖ్యంగా యూరోపియన్‌ దేశాల్లో గ్రీన్‌ పార్టీలకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. కీలకమైన పార్లమెం­టరీ స్థానాల్లో గెలుపొందటమే కాదు ముఖ్యమైన ప్రభుత్వ పదవులను సైతం చేప­డుతుండటం విశేషం. క్లైమెట్‌ ఛేంజ్‌ వల్ల పర్యావరణ విపత్తులు గతమెన్నడూ ఎరుగని రీతిలో విరుచుకు పడుతున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయ రాజకీయ పార్టీల కూసాలు కదులుతుండగా గ్రీన్‌ పార్టీలకు ప్రజల్లో అంతకంతకూ ప్రాధాన్యం పెరుగుతోంది. - పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌
ఇవి కూడా చదవండి: ఇది గ్రీన్‌ పాలిటిక్స్‌ యుగం! రాజకీయ పార్టీలే గ్రీన్‌ పార్టీలుగా..!

మరిన్ని వార్తలు