రూట్ మార్చిన పొన్నం.. టార్గెట్‌ అదే!

27 Aug, 2023 15:43 IST|Sakshi

మాజీ ఎంపీ పొన్నం రూట్ మార్చేశారు. తనకు అచ్చిరాని చోట నుంచి.. మరో కొత్త చోట తన భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డారు. అనువుగాని చోట అధికులమనరాదనే భావనతో పాటు.. కలిసొచ్చే చోట ప్రయత్నిస్తే లక్కూ కలిసి రావొచ్చనేమో పొన్నం యోచన. అందుకే ఇప్పుడు పొన్నం చూపు హుస్నాబాద్ నియోజకవర్గం వైపు పడింది. సరే, మరి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మాటేమిటి..? ఆయనెంతవరకూ పొన్నంకు సహకరిస్తారు..? మరోవైపు కామ్రేడ్స్‌ కత్తిదూస్తున్న ఆ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

ఎవరెవరు ఆశావహులు ఏ ఏ నియోజకవర్గాల నుంచి బరిలో ఉండాలనుకుంటున్నారో తెలుసుకునేందుకు తెలంగాణా కాంగ్రెస్ దరఖాస్తుల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసింది. అయితే, అంతా అనుకున్నట్టుగా కరీంనగర్ నుంచి కాకుండా.. ఈసారి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తన భవిష్యత్తును హుస్నాబాద్ నుంచి  పరీక్షించాలనుకోవడమే విశేషం.

అందుకోసం కరీంనగర్ స్థానానికి ఆశావహ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోని పొన్నం ప్రభాకర్.. హుస్నాబాద్  కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తానే మీడియా ముఖంగా తెలిపారు. తన ఇష్టదైవమైన పొట్లపల్లి  స్వయం భూ రాజరాజేశ్వరుడితో పాటు.. హుస్నాబాద్‌లో గుట్టపైనున్న సిద్ధరామేశ్వరుడిని దర్శించుకుని... తాను హుస్నాబాద్ నుంచే బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు. పొన్నం తరపున ఆయన సోదరుడు గాంధీభవన్ లో దరఖాస్తు చేశారు. అయితే, ఇప్పుడు పొన్నం చూపు హుస్నాబాద్ వైపు ఎందుకు పడిందనేదే సర్వత్రా జరుగుతున్న చర్చ.

పొన్నంకు అసలే రోజులు బాలేనట్టుగా కనిపిస్తున్నాయి. తనకు ఎన్నికల వేళ ఎలాంటి పదవులు ప్రకటించకపోవడం.. పొన్నం అలగడం.. 48 గంటల్లోపు పొన్నంకు పదవిస్తామని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించడం.. ఆ తర్వాత ఎలాంటి ఊసూ లేకపోవడంతో ఒకింత అసహనంగానే పొన్నం పొల్టికల్ జర్నీ ప్రస్తుతం కొనసాగుతోంది. పైగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి బరిలోకి దిగితే మూడోస్థానానికి పరిమితం కావడం.. 2014, 2018 కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలూ కలిసి రాకపోవడంతో పొన్నం కరీంనగర్ నుంచి తన మనసు మార్చుకున్నారు.

పైగా పొన్నం ప్రభాకర్ కు గత పార్లమెంట్ ఎన్నికల్లో.. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్ లోనే 50 వేలకు పైగా ఓట్లు పోలవ్వడం.. ఈ నియోజకవర్గంలో తన గౌడ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 40 వేల వరకూ ఉండటం.. తనకున్న బీసీ కార్డుకు.. ఓ 90 వేల ఓట్ల పైచిలుకు అడ్వంటేజ్ గా భావించడం.. సతీష్ బాబుకు దీటైన నాయకుడు లేడన్న భావన.. తనైతే గెలవగలనన్న భరోసా.. అంతకుమించి తన అనుయాయులు, అనుచరుల నుంచి వచ్చిన ఒత్తడి వంటివాటితోనే పొన్నం అడుగులు హుస్నాబాద్ వైపు పడినట్టుగా తెలుస్తోంది.

అయితే, ఇప్పటికే హుస్నాబాద్ లో మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇంటింటి తన ప్రచారాన్ని ప్రారంభించారు. మీడియాలో పెద్దగా లైమ్ లైట్ లో లేకున్నా.. సోషల్ మీడియాలో తన ప్రచారం కొనసాగిస్తున్నారు.  ఈ నేపథ్యంలో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి.. పొన్నంకు సహకరిస్తారా..? కాంగ్రెస్ టిక్కెట్ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికా.. లేక, కొత్తగా బరిలోకి దిగుతున్న పొన్నంకా...? ఒకవేళ హుస్నాబాద్ లో తనకు టిక్కెట్ రాకుంటే పొన్నం అడుగులెలా ఉండబోతాయి...? ఒకవేళ పొన్నంకే టిక్కెట్ ఇస్తే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటూ పొన్నంకు సహకరిస్తారా..? లేక, ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో.. కమలం వైపు ఏమైనా అడుగులు వేస్తారా అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పై విరుచుకుపడుకున్న కామ్రెడ్స్ కు కూడా హుస్నాబాద్ స్థానంలో బరిలో ఉండాలన్నది గట్టి తలంపు. ఈ క్రమంలో కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తు కుదురుతుందా..? మిత్రపక్షంగా కాంగ్రెస్ నుంచి అయితే పొన్నం.. లేదంటే అల్గిరెడ్డి ఎవ్వరు బరిలో ఉన్నా.. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పోటీకి దూరంగా ఉంటారా...? ఎంత మిత్రపక్షమైనా.. బరిలో నిల్చే విషయంలో మిత్రభేదం తప్పదంటూ చాడ కూడా బరిలోకి దిగుతారా...? అప్పుడు మొత్తంగా హుస్నాబాద్ రాజకీయమెలా ఉండబోతుందన్నది ఇప్పుడు కడు ఆసక్తికరంగా మారింది.

కరీంనగర్ నుంచి తన మనసు మార్చుకుని పొన్నం పక్కకు తప్పుకోవడంతో కరీంనగర్ అసెంబ్లీకి కూడా ఆశావహుల జాబితా పెద్దదే తయారైనట్టుగా గాంధీభవన్ లో దరఖాస్తైన ఫారాలే చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలో హుస్నాబాద్ వైపు పొన్నం చూపు పడటంతో.. జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు సంబంధించిన చర్చతో పాటు.. హుస్నాబాద్‌లో ఫైట్ పై ఓ పేద్ద డిబేటే కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు