కేసీఆర్‌ నోట పదేపదే ఈటల మాట.. దీని వెనక మతలబు ఏంటీ?

13 Feb, 2023 13:09 IST|Sakshi

ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. టీడీపీని లాక్కొని చంద్రబాబు సీఎం అయ్యారు. చంద్రబాబును కాదని.. తెలంగాణ జెండా ఎత్తిన కేసీఆర్‌ సీఎం అయ్యారు. మరీ సీఎం కేసీఆర్‌ కాదనుకున్న.. ఈటల రాజేందర్‌ అనుకున్న లక్ష్యం సాధిస్తారా?.

ఈటల రాజేందర్‌ను వెస్ట్‌ బెంగాల్‌ సువేంధు అధికారి తరహాలో బీజేపీ ఫోకస్‌ చేయడం లేదా? కరెక్ట్‌ ఫ్లాట్‌ ఫాంపై ఈటల నిలబడలేదా? అసెంబ్లీలో కేసీఆర్‌ పదేపదే ఈటల పేరు ప్రస్తావించడం వెనక కారణాలేంటీ? మొన్నటి వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష రేసులో నిలబడ్డ ఈటల.. ఇప్పుడు పార్టీలోనే ఉంటా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది?

వర్తమానం ఆగమ్యగోచరం?
ఈటల రాజేందర్‌.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో పాటు నడిచిన సైనికుడు.. కేసీఆర్‌ కోటరీలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించారు.. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. తప్పని పరిస్థితుల్లో ఈటలను మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ తర్వాత కొద్దికాలానికే భూ ఆక్రమణల ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి ఈటలను బర్తరఫ్‌ చేశారు.

అటు కాంగ్రెస్‌.. ఇటు బీజేపీ.. మధ్యలో సొంత వేదిక అనేక చర్చలు జరిపి చివరకు కాషాయ కండువా కప్పుకున్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో అధికార పార్టీపై గెలిచి సత్తా చాటుకున్నారు. ఆ తర్వాత మెల్లిగా బీజేపీ పార్టీలో పట్టు సాధించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అండదండలు పుష్కలంగా ఉండటంతో ఈటల రాజేందర్‌ పార్టీలో తిరుగులేదని చెప్పవచ్చు.

త్వరలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటల రాజేందర్‌కు దక్కుతుందనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే జాతీయ అధ్యక్షుడు నడ్డా పదవీ కాలాన్ని పొడిగించడంతో.. ఇక్కడ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ పదవీ కాలాన్ని పొడగిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్ష పదవీ రేసులోకి వచ్చిన ఈటల రాజేందర్‌ను ఒక్కసారిగా అయోమయంలో పడేశారు సీఎం కేసీఆర్‌. ఈటల పేరును అసెంబ్లీలో పదే పదే సీఎం కేసీఆర్‌ ఉచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.

అదొక మిలియన్‌ డాలర్‌ కొశ్చన్‌..
ఈటల రాజేందర్‌ పేరుకు హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచినా.. అక్కడ అధికారిక కార్యక్రమాలన్ని ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డి సమక్షంలోనే జరుగుతున్నాయి. ఇటీవల మంత్రి కేటీఆర్‌ పర్యటించినా.. ఎమ్మెల్యేను ఆహ్వనించలేదు. ఈటల రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఎమ్మెల్సీ కౌశిక్‌ రెడ్డికి శాసన మండలిలో విప్‌ బాధ్యతలు అప్పగించారు. మరో వైపు ఈటల సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాశ్‌కు మండలి డిప్యూటీ వైస్‌ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు అసెంబ్లీ మాత్రం ఈటల రాజేందర్‌ పేరును పదే పదే ప్రస్తావించడం వెనక కారణాలపై బీజేపీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి. తాజాగా బీజేపీలో నేతల మధ్య అనుమానాలు పెరిగిపోయాయి. ఓ కీలక నేత కేసీఆర్‌ ఫాంహౌజ్‌కు వెళ్లివచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈటల సలహాలు తీసుకుంటామని కేసీఆర్‌ చెప్పడం వెనక మతలబు ఏంటీ? అన్న చర్చ సాగుతోంది.

పొలిటికల్‌ స్ట్రాటజీలో భాగంగానే ఈటలను దెబ్బతీసే విధంగా మాట్లాడి ఉంటారని కమలనాథులు భావిస్తున్నారు. ఇటీవల కేసీఆర్‌కు అన్ని రాజకీయ పార్టీల్లో కోవర్టులు ఉంటారని ఈటల రాజేందర్‌ చేసిన కామెంట్స్‌ కాషాయ పార్టీలోకి మరోవర్గం నేతలు గుర్తు చేస్తున్నారు. ఎవరు మిత్రులు ? ఎవరు శత్రువులు ? ఎవరు కోవర్టులు ? తెలియని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

అక్కడ అలా? ఇక్కడెందుకు ఇలా?
పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కాదనుకుని వచ్చిన సువేంధు అధికారిని బీజేపీ చాలా ఫోకస్‌ చేసింది. అదేతరహాలో తెలంగాణలో తనకు ఫోకస్‌ దొరుకుతుందని ఈటల రాజేందర్‌ ఆశించారు. అనుకున్న స్థాయిలో పార్టీ నుంచి సపోర్ట్‌ దక్కడం లేదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ సువేంధు అధికారి తనతోపాటు చాలా మంది నేతలను బీజేపీలో చేర్చడంలో సఫలమయ్యారు.

ఇక్కడ ఈటల రాజేందర్‌ వెంట.. చెప్పుకోదగ్గ స్థాయిలో నేతలు బీజేపీలోచేరలేదు. పార్టీలో కొత్తగా చేరికల కమిటీ వేసి.. ఇతన్నే ఛైర్మన్‌గా నియమించినా చేరికలు జరగలేదు. చేరికల కమిటీ ఉంటుందా ? అవసరమా ? అన్ని రాజకీయ పార్టీల్లో కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారంటూ ఈటల చేసిన కామెంట్స్‌ పార్టీ అధినాయకత్వం వరకు చేరాయి. తాజాగా కేసీఆర్‌ అసెంబ్లీలో ఈటల పేరు ప్రస్తావించడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన ఈటల రాజేందర్‌.. చివరకు పార్టీలోనే ఉంటా అనే స్థాయికి పడిపోవడం చర్చనీయాంశంగా మారింది.
చదవండి: ఎలాగు రాజీనామా చేయ్సాలిందే.. కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌ 

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం కాగా.. చంద్రబాబుతో విభేదించిన కేసీఆర్‌ సీఎం కాగా.. తనకు అలాంటి అవకాశం వస్తుందని ఈటల భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  పనిచేస్తున్న రాజకీయ పార్టీల  నుంచి పొమ్మనలేక పొగబెట్టి పంపించిన దేవేందర్‌ గౌడ్‌, నాగం జనార్ధన్‌ రెడ్డిలాంటి నేతలు మళ్లీ ఫోకస్‌లోకి రాలేని విషయాన్ని కూడా ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. 
-విక్రమ్‌, సాక్షి న్యూస్‌, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు