ముచ్చటగా మూడోసారి బరిలోకి.. ఈసారి ఓటమి తప్పదా?

4 Oct, 2023 15:29 IST|Sakshi

మానుకోటలో మారుతున్న రాజకీయాలు

కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ మద్య ప్రధానపోటీ

సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు చెక్ పెట్టేలా చక్రం తిప్పుతున్న స్వపక్ష నేతలు

అధిష్టానం ఆదేశంతో ఐక్యంగా ఉన్నా అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తి సెగలు

కాంగ్రెస్‌లో తప్పని గ్రూప్ రాజకీయాలు

బీజేపీ ఒంటరి పోరాటంతో మూడో స్థానమే దిక్కు

పోరాటాల పురుటి గడ్డ మానుకోట. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న మానుకోట తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావంతో గులాబీ తోటకు అడ్డగా మారింది. ఎస్టీ రిజర్వుడు స్థానమైన మహబూబాబాద్ లో గిరిజన నేతల మద్య రాజకీయ పోరు రక్తికట్టిస్తుంది. పార్టీలు ఎన్ని ఉన్నా ప్రధానంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ బిజేపి మద్యనే పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తుంటే, కాంగ్రెస్ బిజేపి ఇంకా అభ్యర్థి ఎంపికలో తలమునకలై పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. పాతకాపుల మద్యనే మానుకోటలో పోటీ నెలకొన్న పాలిటిక్స్‌పై స్పెషల్ స్టోరీ.

ప్రజానాయకుడిగా పేరు
ఒకప్పటి మానుకోట మహబూబాబాద్‌గా మారి జిల్లా కేంద్రంగా అవతరించింది. నియోజకవర్గాల పునఃర్విభజనతో ఎస్టీ రిజర్వుగా మారిన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు మండలాలు 155 గ్రామ పంచాయితీలు 238734 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ కు చెందిన శంకర్ నాయక్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అవిర్బావంతో 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిన శంకర్ నాయక్ రెండోసారి 2018లో గెలిచి ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

విమర్శలకు తోడు గ్రూప్ రాజకీయాలు
ముచ్చటగా మూడో సారి బీఆర్ఎస్ నుంచి బరిలో నిలుస్తున్న శంకర్ నాయక్ ఈసారి ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిన శంకర్ నాయక్‌కు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని బట్టి గెలుపుఓటములు ఆధారపడి ఉన్నాయి. రెండు సార్లు ఎమ్మెల్యే అయిన శంకర్ నాయక్ బినామీ పేర్లమీద ఆస్థులు కూడబెట్టారనే విమర్శలు ఉన్నాయి. విమర్శలకు తోడు పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ రవీందర్ రావుతో సఖ్యత లేకపోవడం, మంత్రి సత్యవతి రాథోడ్‌తో అంటిముట్టనట్లు వ్యవహరించడం అతనికి ప్రతికూలంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
చదవండి: కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న మాట నిజమే: ఈటల

శంకర్ నాయక్‌కు చెక్ పడే పరిస్థితులు
ఒకదశలో ఈ ఎమ్మెల్యే మాకొద్దు అంటు స్వపక్ష పార్టీ నాయకులే రోడ్డెక్కారు. అధిష్టానం పెద్దలు పార్టీనాయకుల మద్య సయోద్యకుదుర్చి మూడో సారి శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వడంతో అభ్యర్థిని మార్చాలనే డిమాండ్‌తో ఆందోళనకు సైతం జరిగాయి. పార్టీ పెద్దల జోక్యంతో ప్రస్తుతం అంతా సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా రగిలిపోతున్న నాయకులతో శంకర్ నాయక్‌కు చెక్ పడే పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే ప్రచారం సాగుతుంది.       

తనకే టికెట్ వస్తుందనే ధీమా
ఇక కాంగ్రెస్‌లో అదే పరిస్థితి నెలకొంది. టిక్కెట్ రేసులో కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, డాక్టర్ మురళి నాయక్ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో బలరాం నాయక్ పోటీ చేసి శంకర్ నాయక్‌పై 13వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతోపాటు అధిష్టానం పెద్దల ఆశిస్సులు ఉండడంతో ఈసారి సైతం తనకే టికెట్ వస్తుందనే దీమాతో ఉన్నారు.

గట్టి పోటీ
బలరాం నాయక్ అభ్యర్థి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గెలుపుకు తిరుగుండదని ఇరు పార్టీల నాయకులు బావిస్తున్నారు. బలరాం నాయక్ కంటే స్థానిక డాక్టర్ ప్రజలతో తత్సంబందాలు ఉన్న మురళీ నాయక్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపితే గట్టి పోటీ ఉంటుందని బావిస్తున్నారు. బలరాంనాయక్ ను కాదని మురళీనాయక్‌కు టికెట్ దక్కే పరిస్థితి లేదని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. 

నామమాత్రంగానే బీజేపీ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్ పోటీ చేయనున్నారు. గత 2018 ఎన్నికల్లో పోటీ చేసిన హుస్సెన్ నాయక్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. యూత్ పాలోయింగ్ ఎక్కువగానే ఉన్నప్పటికి ఓట్లను రాబట్టుకోవడంలో విఫలం అవుతున్నారనే భావన ప్రజల్లో ఉంది. తాజా రాజకీయ పరిస్థితుల నేపద్యంలో హుస్సెన్ నాయక్ పోటీ నామమాత్రంగా మారనుంది.
చదవండి: ఈనెల 16న బీఆర్‌ఎస్‌ భారీ సభ.. మేనిఫెస్టో విడుదల 

ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్యనే నువ్వానేనా అన్నట్లు పోటీ సాగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, గ్రూప్ రాజకీయాలను విపక్షాలు అనుకూలంగా మలుచుకునే పనిలో పడి ఎత్తుకు పై ఎత్తులతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్‌లో సైతం గ్రూప్ రాజకీయాలు, అభ్యర్థి విషయంలో క్లారిటీ లేక పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అది కాస్త శంకర్ నాయక్‌కు అనుకూలంగా మారే పరిస్థితులున్నాయి. 

మరిన్ని వార్తలు