రాజకీయాల్లో రజనీ రాణించేనా!?

26 Dec, 2020 15:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :‘ఇదిగో రాజకీయాల్లోకి వస్తోన్నా!’ అని సినీ నటుడు రజనీకాంత్‌ ప్రకటించినప్పుడల్లా అటు ఆయన అభిమానుల్లో, ఇటు తమిళ మీడియాలో కృత్రిమ కోలాహలం చెలరేగుతోంది. అప్పుడు ఆ రెండు వర్గాలు, తమిళనాట రజనీకోసం పనిచేసే ప్రచార సినీ టీమ్‌తో కలసి సందర్భాన్ని సొమ్ము చేసుకుందామని చూస్తాయి. ఎప్పటి నుంచో జరుగుతున్న తతంగమే ఇది! సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఎంజీ రామచంద్రన్‌తో సామీప్యతను పట్టుకొచ్చేందుకు ఈ మూడు వర్గాలు ఎంత ప్రయత్నించినప్పటికీ తమళ ప్రజలు మాత్రం వారిరువురిని వేర్వేరుగానే చూస్తున్నారు. (నాడు యూపీ.. నేడు మధ్యప్రదేశ్‌)

 రజనీకాంత్‌ ఇటీవల తన పార్టీ పేరును ప్రకటించినప్పుడే కాకుండా కాస్త అనారోగ్యంతో ఆయన శుక్రవారం హైదరాబాద్‌ ఆస్పత్రిలో చేరినప్పుడు కూడా ఆయన రాజకీయ భవితపై చర్చ తీవ్రమయింది. నేడు తమిళనాడు రాష్ట్రం ఎదుర్కొంటోన్న సవాళ్లు లేదా ప్రజా సమస్యలకు రజనీకాంత్‌ వద్ద ఎలాంటి పరిష్కార మార్గం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాటి గురించి ఆయన ఎన్నడూ పెద్దగా ప్రస్తావించ లేదని కూడా చెబుతున్నారు. ఇప్పటికే రాజకీయాల్లో పేరుతెచ్చుకున్న లేదా పాలక పక్షంలో ఉన్న  రాజకీయ నాయకులను తనదైన సినిమా ఫక్కీలో విమర్శించడం ద్వారా అభిమానులతో చప్పట్లు కొట్టించుకోవడమే ఆయనకు తెలుసంటున్నారు. 

కోట్లాది తమిళ ప్రజల నలుపూ తెలుపు దయనీయ జీవితాలను చూడడానికి ఎన్నడూ ఇష్టపడని రాజకీయ నేతలు ఓడిపోతామనుకున్నప్పుడల్లా,  జీవితంలో కాస్త ఉపశమనాన్ని వెతుక్కునేందుకు సినిమాలకు వెళ్లే సాధారణ ప్రజల ఓట్ల కోసం సినిమా గ్లామర్‌ను పట్టుకొస్తారు. తమకు అండగా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటారు. అవసరమైతే టిక్కెట్లు కూడా ఇస్తారు. అత్యవసరమైతే నాయకుడిగా ముందు నిలబెట్టి వెనక నడుస్తామని చెబుతారు. అదో రంగుల రాజకీయం. 1950 దశకంలో ఎంజీఆర్‌ కూడా ఇలాగే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ద్రావిడ మున్నేట్ర కళగం వ్యవస్థాపక నాయకులు సీఎన్‌ అన్నాదురై, తమిళ సినీ అభిమానుల్లో ఎంజీఆర్‌కున్న పలుకుబడిని ఉపయోగించడం కోసం ఆయన్ని రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ఎంజీఆర్‌ రాకతో అప్పటి వరకు ఆయన ముఖ్య అనుచర బృందంలో ముఖ్యుడుగా వున్న కరుణానిధి ప్రాధాన్యతన తగ్గుతూ వచ్చింది. కరుణానిధిని ఎదుర్కొనేందుకు ఎంజీఆర్‌ ద్రావిడ ఉద్యమ స్ఫూర్తిని మరవకుండానే మంచి రాజకీయ వ్యూహ రచనతో రాజకీయాల్లో రాణించారు. 

నేటి తమిళ రాజకీయ పార్టీల్లో పలువురు సినీ నటులతోపాటు సినీ నటీమణులు కూడా ఎక్కువే ఉన్నారు. వారిలో మూడోవంత మంది తాము ముఖ్యమంత్రి పదవికి అర్హులమని భావిస్తారు. మేకప్‌ కిట్‌ను మార్చేసి ముఖ్యమంత్రి అయిపోవడమే ఇక తరువాయి అని అనుకుంటారు. వారికి ఏ విధంగా రజనీకాంత్‌ భిన్నమని రాజకీయ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో ద్రావిడ ఉద్యమానికి తెరదించి, ద్రావిడ పార్టీలను తెర వెనక్కి పంపించడం కోసం రజనీకాంత్‌ను ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తోందని వారు ఆరోపిస్తున్నారు. 

ద్రావిడ ఉద్యమం వెనకనున్న చారిత్రక, తాత్విక, రాజకీయ, హేతువాద పునాదులను అసలు ఈ పార్టీలు అర్థం చేసుకోవడం లేదని, ద్రావిడ ఉద్యమ హేతువాదాన్ని రజనీకాంత్‌ గందరగోళ ఆధ్యాత్మిక వాదంతో దెబ్బతీయాలనుకుంటున్నారని, అది అంత సులువు కాదని హేతువాద మేధావులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వ్యూహాత్మకంగా రాజనీకాంత్‌ను ఉపయోగించుకొంటూ వస్తోన్న బీజేపీకి అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందని కూడా వారు చెబుతున్నారు. డీఎంకేకన్నా అఖిల భారత అన్నా డీఎంకే పార్టీ ఓట్లనే రజనీకాంత్‌ ఎక్కువగా చీల్చే అవకాశం ఉందని, అది తమిళనాట ప్రభావాన్ని పెంచుకునేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏండెంకే ఎన్నికల పొత్తుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి ప్రతికూల పరిణామమేనని మద్రాస్‌ యూనివర్శిటీ పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ రాము మణివన్నన్‌ వ్యాఖ్యానించారు. 

అలాంటి పరిస్థితే ఏర్పడితే బీజేపీ బీహార్‌లో జేడీయూను దూరం చేసినట్లు ఏఐఏడిఎంకేను దూరం చేయగలదని హేతువాద మేధావులు అంచనా వేస్తున్నారు. రజనీకాంత్‌ పలుకుబడిని కూడా బేజేపీ ఎక్కువగా ఊహిస్తోందని, ఆయన అభిమానులంతా 55 ఏళ్లు, ఆ పైబడిన పురుషులేనని, ఆయన అభిమాన ఆడవాళ్లు కూడా అదే వయస్సు వారని, అయితే వారి సంఖ్య పురుషులకన్నా చాలా తక్కువని వారంటున్నారు. 

కమలాహాసన్‌ ‘పాత్ర’
తమిళనాడులో రాజకీయాలకు, సినీ జీవితాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. అక్కడ ప్రజలకు సినిమా మోజు ఎక్కువగా ఉన్న తమ రాజకీయ ఉనికిని, సంస్కృతిని మరచిపోలేరు. ద్రావిడ ఉద్యమ నేపథ్యాన్ని విస్మరించకుండానే రాజకీయాల్లో రాణించాలనుకుంటున్న కమల హాసన్, రజనీకాంత్‌కు స్నేహ హస్తం చాస్తున్న విషయం తెల్సిందే. రజనీతో కలసి తమిళనాడులో మూడవ ఫ్రంట్‌గా ప్రత్యామ్నాయం కావాలన్నది కమల్‌ హాసన్‌ వ్యూహం. ఇప్పటికే పరోక్షంగా బీజేపీకి మద్దతిస్తున్న రజనీకాంత్, కమల హాసన్‌ను కలుపుకోలేక పోతున్నారు. వారిని సినీ జీవితం ‘సంఘర్షణ–సహకారం’ చందంగా రాజకీయ జీవితం భిన్నంగా ఉండక పోవచ్చు. ఆ మాటకొస్తే నేటి తరం తమిళ నటులకు వీరిద్దరికన్నా ప్రేక్షకాదరణ లేదా ప్రజాకర్షణ శక్తి ఎక్కువగా ఉంది. 

మరిన్ని వార్తలు