రాష్ట్రంలో నియంత పాలన పోవాలి: షర్మిల 

17 Mar, 2022 04:20 IST|Sakshi

భువనగిరి: తెలంగాణ ప్రజలు బాగుపడాలంటే కేసీఆర్‌ నియంత పాలన పోవాలని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే గెలిచిన వారు టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని, ఇది రాజకీయ వ్యభిచారమేనని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం గోకారం, వర్కట్‌పల్లి, సంగెం గ్రామాల్లో కొనసాగింది.

గోకారం గ్రామం వరకు 300 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. సంగెం గ్రామంలో ఏర్పాటు చేసిన మాటముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రైతులకు ఎరువులకు సబ్సిడీతోపాటు పంట నష్టపరిహారమూ ఇవ్వడం లేదన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన కొనసాగించారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకురావడం కోసమే తాను పార్టీని ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. ప్రజలు అవకాశం ఇస్తే నమ్మకంగా పనిచేస్తామని, ప్రతీ మహిళకు ఇల్లు ఇచ్చి వారి పేరు మీదనే ఉండేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, ఏపూరి సోమన్న, సత్యవతి, పార్టీ జీఎంహెచ్‌సీ కోఆర్డినేటర్‌ రాజగోపాల్, జిల్లా కోఆర్డినేటర్‌ మహమ్మద్‌ అతహర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు