Devendra Fadnavis: మీ భార్యలు కొట్టినా మోదీ బాధ్యతేనా?

27 Jun, 2021 11:42 IST|Sakshi

రాజకీయ సన్యాసానికైనా సిద్ధమే

ఓబీసీలకు రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలొద్దు 

ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు  

ఏం జరిగినా మోదీకి ఆపాదిస్తున్నారని ఆఘాడీ నేతలపై ధ్వజం 

సాక్షి ముంబై: తమకు అధికారం కల్పిస్తే ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, అలా ఇప్పించలేని పక్షంలో రాజకీయ సన్యాసానికైనా సిద్ధమేనని ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంతోనే ఓబీసీలు రిజర్వేషన్‌ కోల్పోయారని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్‌ లేకుండా ఎన్నికలు జరగనివ్వం అని ఫడ్నవిస్‌ తేల్చిచెప్పారు. ఓబీసీ రిజర్వేషన్‌ లేకుండా ఆఘాడీ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. అనేక ప్రాంతాల్లో జైలు భరోతోపాటు చక్కా జామ్‌ ఆందోళన నిర్వహించారు. ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌తోపాటు ఆశీష్‌ శెలార్, ప్రవీణ్‌ దరేకర్‌ తదితరుల నేతృత్వంలో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ఆందోళన జరిగింది.

దీంతో అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతమైన వాతావరణం ఏర్పడగా మరోవైపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ఆందోళనల నేపథ్యంలో ముందు నుంచే అప్రమత్తమైన పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆందోళన చేపట్టడంతో దేవేంద్ర ఫడ్నవిస్‌తోపాటు అనేక మంది నేతలను అదుపులోకి తీసుకుని ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కాగా, మరాఠా రిజర్వేషన్‌తోపాటు ఓబీసీ రిజర్వేషన్‌ల అంశంపై రాష్ట్ర రాజకీయాల అంశం రాష్ట్ర రాజకీయాల్లో వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఓ వైపు స్థానిక స్వరాజ్య సంస్థల ఎన్నికలు మరోవైపు ముంబై, థాణే, పుణేలతోపాటు 10 మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో జరగబోయే ఎన్నికలు తదితరాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో చర్చలకు దారి తీసింది.  

మీ భార్యలు కొట్టినా మోదీ బాధ్యతేనా.. 
రాష్ట్రంలో స్థానిక స్వరాజ్య సంస్థల ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓబీసీల రాజకీయ రిజర్వేషన్‌ కోటా లేకుండానే కమిషన్‌ ఎన్నికలు ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో బీజేపీ శనివారం ఆందోళన నిర్వహించి తమ నిరసన తెలిపింది. నాగ్‌పూర్‌లో దేవేంద్ర ఫడ్నవిస్‌ నేతృత్వంలో బీజేపీ ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహా వికాస్‌ ఆఘాడీ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఓబీసీలకు రాజకీయంగా రిజర్వేషన్‌ కల్పించాలనే డిమాండ్‌ కోసమే ఈ ఆందోళన చేపట్టామని, రిజర్వేషన్‌ వారికి ఇప్పించలేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. ఓబీసీలకు రిజర్వేషన్‌ లేకుండా ఎన్నికలు జరగనివ్వం అంటూ హెచ్చరించారు.

రాబోయే మూడు నాలుగు నెలల్లో ఓబీసీలకు రిజర్వేషన్‌ కల్పించవచ్చని, తమకు అధికారం కల్పిస్తే రిజర్వేషన్‌ ఇస్తామని ఫడ్నవిస్‌ హామీ ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో ఏది జరిగినా అది మోదీ కారణంగానే అని మహావికాస్‌ ఆఘాడీ నేతలు ఆరోపిస్తున్నారని, రేపు ఆ నేతల భార్యలు వారిని కొట్టినా అది మోదీ బాధ్యతనే అనేలా ఉన్నారని ఫడ్నవిస్‌ చురకలంటించారు. కోల్హాపూర్‌లో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ నేతృత్వంలో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే, విజయ్‌ వడెట్టివార్‌లతోపాటు ఉపముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. కనీసం ఓబీసీ నేతలతో చర్చలు కూడా జరిపేందుకు సిద్దంగా లేరని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనంతోనే రిజర్వేషన్‌ కోల్పోయినట్లు పాటిల్‌ ఆరోపించారు. 

షోలాపూర్‌లో... 

షోలాపూర్‌లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ ఆందోళన నిర్వహించింది. హైదరాబాద్‌ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సిద్దేశ్వర్‌ మార్కెట్‌ ఎదుట నిర్వహించిన ఆందోళనలో ఎమ్మెల్యే విజయ్‌ దేశ్‌ముఖ్, షోలాపూర్‌ మేయర్‌ శ్రీకాంచన యెన్నం, పట్టణ అధ్యక్షుడు విక్రం దేశ్‌ముఖ్‌ల నేతృత్వంలో కొనసాగిన ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ రహదారిని దిగ్భందించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ముంబైలో ఆశీష్‌ శెలార్, ఎంపీ మనోజ్‌ కోటక్, పుణేలో పంకజా ముండే, థానేలో ప్రవీణ్‌ దరేకర్‌ తదితరుల నేతృత్వంలో నిరసనలు జరిగాయి. చదవండి :  Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడో తెలుసా ?

 
 

Read latest Politicsl News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు