పెండింగ్‌ క్లెయిమ్‌లు త్వరగా పరిష్కరించాలి

17 Nov, 2023 01:40 IST|Sakshi
వీడియో సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా

ఒంగోలు అర్బన్‌: ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పెండింగ్‌ క్లెయిమ్‌లు త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. గురువారం కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు. దీనిలో ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ 30 రోజులు దాటిన క్లెయిమ్‌లన్నీ ఈనెల 23వ తేదీ నాటికి తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. దీనిలో మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌, డీఆర్‌ఓ శ్రీలత, ఈఆర్‌ఓలు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సైనిక స్కూల్‌, విశ్రాంత సైనికుల వైద్యశాల ఏర్పాటు చేయాలి

కేంద్ర రక్షణ శాఖ సెక్రటరీని కోరిన ఎంపీ మాగుంట

ఒంగోలు సెంట్రల్‌: ఒంగోలులో సైనిక స్కూల్‌, విశ్రాంత సైనికుల (ఈసీహెచ్‌ఎస్‌) వైద్యశాలను ఏర్పాటు చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కేంద్ర రక్షణ శాఖ సెక్రటరీ గిరధర్‌ అరమనేనిని కలసి విజ్ఞప్తి చేసినట్లు మాగుంట కార్యాలయ ప్రతినిధి భవనం సుబ్బారెడ్డి తెలిపారు. జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరులో, దాని పరిసర ప్రాంతాల్లో రక్షణ శాఖలో 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, రిటైర్డ్‌ ఉద్యోగులు మరో 13 వేల మంది వారి కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పారు. వారి సేవల నిమిత్తం గిద్దలూరులో ఉన్న చిన్న వైద్యశాల వారి వైద్య అవసరాలు తీర్చలేకపోతోందని చెప్పారు. ప్రభుత్వ జాబితాలో చేర్చిన అన్ని సదుపాయాలతో ఈహెచ్‌ఎస్‌ వైద్యశాలను ఒంగోలులో ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన కేంద్ర రక్షణ శాఖ సెక్రటరీ గిరధర్‌ అరమనే వైద్యశాల ఏర్పాటు చేస్తామని, సైనిక స్కూల్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి తెలిపారు.

విద్యార్థుల అభ్యసన స్థాయి పెంపునకు కృషి

డీఈవో వీఎస్‌ సుబ్బారావు

ఒంగోలు సెంట్రల్‌: విద్యార్థుల అభ్యసన స్థాయి పెంపునకు ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని డీఈవో, సమగ్ర శిక్షణ అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ వీఎస్‌ సుబ్బారావు అన్నారు. స్థానిక సమగ్ర శిక్ష కార్యాలయం సమావేశపు మందిరంలో గురువారం దివ్యాంగ విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ సుబ్బారావు మాట్లాడుతూ దివ్యాంగుల సాధారణ విద్యార్థులతో సమానమని వారి అభ్యసన స్థాయిల పెంపుదలకు ట్యాబ్స్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. ల్యాబ్స్‌ సక్రమంగా ఉపయోగించుకునేలా తల్లిదండ్రుల కృషి కూడా ఉండాలని చెప్పారు. జిల్లాలోని వివిధ హైస్కూల్స్‌లో పనిచేస్తున్న రిసోర్స్‌ కూడా ట్యాబ్స్‌ అందిస్తామన్నారు. ఈ ట్యాబ్స్‌లో దివ్యాంగ విద్యార్థుల దృష్టి, శ్రవణ లోపం ఉన్న వారి కోసం ప్రత్యేకమైన యాప్‌ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. స్పెషల్‌ టీచర్లు ట్యాబ్‌ అందుకున్న విద్యార్థుల ప్రగతిని గమనించాలని ఆదేశించారు. వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అర్చన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఐఈ కోఆర్డినేటర్‌ ఎం.రమేష్‌, ప్రభుత్వ బధిరుల పాఠశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు, స్పెషల్‌ టీచర్లు, రిసోర్స్‌ పర్సన్స్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు