ర్యాంకర్లకు విద్యాధికారి ప్రశంసలు

30 May, 2023 00:08 IST|Sakshi
వేములవాడ రాజన్న జట్టును అభినందిస్తున్న ఈవో కృష్ణప్రసాద్‌

సిరిసిల్లకల్చరల్‌: వివిధ పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులను జిల్లా విద్యాధికారి రమేశ్‌ అభినందించారు. స్థానిక యోగీశ్వర ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న విద్యార్థులు పాలిసెట్‌, టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశపరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. వి.ప్రీతి పాలీసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు, ఎం.జశ్వంత్‌ టీఎస్‌ఆర్‌జేసీ పరీక్షలో రాష్ట్ర స్థాయి ఆరో ర్యాంకు సాధించారు. యోగీశ్వర ఇనిస్టిట్యూట్‌ నిర్వాహకుడు గూడూరి నిశాంత్‌, సంతోష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

సెమీ ఫైనల్స్‌కు

వేములవాడ రాజన్న జట్టు

వేములవాడ : రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని విజయ్‌ ఆనంద్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న దేవాలయాల ప్రీమియర్‌ లీగ్‌ –2023 క్రికెట్‌ జట్ల పోటీల్లో వేములవాడ రాజన్న జట్టు యాదగిరిగుట్ట, ఖమ్మం జట్లపై గెలిచి సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న జట్టును ఈవో కృష్ణప్రసాద్‌ అభినందించారు. వైస్‌ క్యాప్టెన్‌గా ఒన్నారం భాస్కర్‌, వికెట్‌ కీపర్‌గా సుధాకర్‌, ఆల్‌ రౌండర్లుగా అరుణ్‌, శివసాయి, పి.వంశీ, పి.సిద్ధూ, పవన్‌కల్యాణ్‌, బాజు, రాము, రాజు, లక్ష్మణ్‌ ప్రతిభ కనబర్చినట్లు క్యాప్టెన్‌ మహేశ్‌ తెలిపారు.

సమయపాలన

పాటించని వైద్య సిబ్బంది

ముస్తాబాద్‌: మండలంలోని పోతుగల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సిబ్బంది విధుల్లో సమయ పాలన పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. చిప్పలపల్లికి చెందిన దివ్య కుమారుడు హిమాన్షు కోతి దాడిలో గాయపడ్డాడు. హిమాన్షును తీసుకొని తల్లి పోతుగల్‌ పీహెచ్‌సీకి సోమవారం ఉదయం వచ్చింది. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో అక్కడే ఉన్న స్వీపర్‌ బాలమ్మను అడిగి వివరాలను తెలుసుకుంది. ఉదయం 9.20 దాటినా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్‌నర్స్‌ రాజేశ్వరి హిమాన్షుకు చికిత్స అందించింది. దీనిపై హెచ్‌ఈవో యాదగిరిని వివరణ కోరగా నిత్యం వైద్యసేవలు అందిస్తామని, సిరిసిల్లలో సమావేశం ఉన్నందున ఉద్యోగులు అందుబాటులో లేరని తెలిపారు. మరోసారి ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

రేషన్‌ దుకాణం

ఏర్పాటు చేయాలి

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో ప్రజల సౌకర్యార్థం కోసం రేషన్‌ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ..కాలనీవాసులు సోమవారం జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌కు విన్నవించారు.160కి పైగా డబుల్‌ బెడ్‌రూంలు ఉండగా, సుమారు 600 మంది నివాసముంటున్నారని, వారంతా నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడం ఇబ్బందిగా మారిందన్నారు. కాలనీలో రేషన్‌ దుకాణం ఏర్పాటు చేయాలని స్థానిక తహసీల్దార్‌ జయంత్‌కుమార్‌ను అదనపు కలెక్టర్‌ ఆదేశించారు.

మరిన్ని వార్తలు