దిగి వచ్చిన ‘రెబల్స్‌’

16 Nov, 2023 06:22 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: అధిష్టానాల బుజ్జగింపులతో రెబల్స్‌ దిగొచ్చారు. ఆయా పార్టీల పెద్దలు రంగంలోకి దిగి పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా అవకాశం కల్పించనున్నట్లు స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారంతా నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన చిన్న శ్రీశైలం యాదవ్‌ తనయుడు నవీన్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ పెద్దల సూచన మేరకు నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఆ పార్టీ అభ్యర్థి అజహరుద్దీన్‌ బుధవారం స్వయంగా వారి ఇంటికి చేరుకుని ఆయనను బుజ్జ గించారు. దీంతో నామినేషన్‌ ఉపసంహరించుకుని కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయనున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల క్రితం బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ఆయన ఇంటికి వెళ్లి ఇదే అంశంపై చర్చించడం తెలిసిందే. అయితే ఆయన మాత్రం బీజేపీని కాదని, కాంగ్రెస్‌లో చేరారు. అదే విధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ అభ్యర్థి దండెం రాంరెడ్డి అధిష్టానం విజ్ఞప్తి మేరకు నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఆయన కాంగ్రెస్‌ను వీడి అధికార బీఆర్‌ఎస్‌లో చేరే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన సున్నపు వసంతం కూడా పోటీ నుంచి వెనక్కి తగ్గారు.

మరిన్ని వార్తలు