జాగో.. మీ ఫోన్‌ రిపేర్‌కు ఇస్తున్నారా? ఈ 10 జాగ్రత్తలు పాటిస్తే మంచిది!

25 Oct, 2022 19:19 IST|Sakshi

డిజిటల్‌ యుగంలో మోసాలకు కూడా టెక్నాలజీ తోడవుతోంది. ఏమరపాటు, నిర్లక్ష్యం, స్వీయతప్పిదాలు నిండా ముంచేస్తున్నాయి. చాలామంది ఫోన్‌ రిపేర్‌కు ఇచ్చే సమయంలో కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. వాటి వల్ల తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. స్వీయ తప్పిదంతో తన అకౌంట్‌ నుంచి రూ. 2 లక్షలకు పైగా డబ్బును పొగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. 

సొంతంగా వ్యాపారం నడిపించుకునే ఓ వ్యక్తి(40).. తన స్మార్ట్‌ఫోన్‌కి సమస్య రావడంతో అక్టోబర్‌ 7వ తేదీన దగ్గర్లో ఉన్న రిపేర్‌కు ఇచ్చాడు. అయితే.. ఫోన్‌ రిపేర్‌ కావాలంటే.. సిమ్‌ కార్డు ఫోన్‌లోనే ఉండాలని, ఆ మరుసటిరోజు సాయంత్రం వచ్చి ఫోన్‌ తీసుకోమని సదరు వ్యక్తితో రిపేర్‌ షాపువాడు చెప్పాడు. గుడ్డిగా నమ్మిన ఆ మధ్యవయస్కుడు..  సిమ్‌ కార్డు ఉంచేసి ఫోన్‌ను ఇచ్చేసి వెళ్లిపోయాడు. 

కానీ, నాలుగు రోజులైన ఆ రిపేర్‌ దుకాణం తెరుచుకోలేదు. ఐదవ రోజు షాపులో పని చేసే మరో కుర్రాడు రావడంతో.. అతన్ని నిలదీశాడు బాధితుడు. అయితే తమ ఓనర్‌ ఊరిలో లేడని.. ఫోన్‌ ఎక్కడుందో తనకు తెలియదని చెప్పాడు ఆ కుర్రాడు. అనుమానం వచ్చిన బాధితుడు.. బ్యాంక్‌ ఖాతాను పరిశీలించగా.. అకౌంట్‌ నుంచి రెండున్నర లక్షల రూపాయలు వేరే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు ఉంది. దీంతో ఆ స్టేట్‌మెంట్‌ కాపీతో పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ముంబై(మహారాష్ట్ర) సాకినాక ప్రాంతంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిని పంకజ్‌ కడమ్‌గా గుర్తించారు. 
   

చేయాల్సినవి

► ఫోన్‌ను రిపేర్‌కు ఇచ్చినప్పుడు సిమ్‌ కార్డును తప్పనిసరిగా తొలగించాలి. 

 కీలక సమాచారం, గ్యాలరీ డేటా లేదంటే ఇంకేదైనా డేటా ఉంటే.. బ్యాకప్‌ చేసుకోవాలి.

 సెక్యూరిటీ లాక్స్‌ తొలగించాలి

 Factory Reset ఫ్యాక్టరీ రీసెట్‌ చేయాలి.

 ఈరోజుల్లో ఇంటర్నల్‌ మొమరీతోనే ఫోన్లు వస్తున్నాయి. ఒకవేళ ఎక్స్‌టర్నల్‌ మొమరీ ఉంటే గనుక తొలగించాకే రిపేర్‌కు ఇవ్వాలి.

 ఒకవేళ మైనర్‌ రిపేర్లు అయితే గనుక.. మెయిల్స్‌, ఇతర సోషల్‌ మీడియా యాప్స్‌ లాగౌట్‌ కావాలి.

 ఫోన్‌కు ఆండ్రాయిడ్‌ పిన్‌ లేదంటే ప్యాటర్న్‌ లాక్‌లో ఉంచడం సేఫ్‌

 IMEI ఐఎంఈఐ నెంబర్‌ను రాసి పెట్టుకోవాలి.

యాప్స్‌కు సైతం లాక్‌లు వేయొచ్చు.

 యూపీఐ పేమెంట్లకు సంబంధించి యాప్‌లకు సెకండరీ పిన్‌ లేదంటే ప్యాటర్న్‌లాక్‌ ఉంచడం ఉత్తమం. 

 స్మార్ట్‌ ఫోన్‌ వాడకం ఇబ్బందిగా అనిపించిన వాళ్లు.. లింక్డ్‌ సిమ్‌లను మామూలు ఫోన్‌లలో ఉపయోగించడం ఉత్తమం. 

► గొప్పలకు పోయి స్మార్ట్‌ఫోన్‌లు వాడాలని యత్నిస్తే.. ఆపరేటింగ్‌ తెలీక ఆ తర్వాత తలలు పట్టుకోవాల్సి వస్తుంది.


చేయకూడనివి

ఫోన్‌లు రిపేర్‌కు ఇచ్చేప్పుడు సిమ్‌ల అవసరం అస్సలు ఉండదు. ఓటీపీ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సిమ్‌ కార్డుతో ఫోన్‌ ఎట్టిపరిస్థితుల్లో రిపేర్‌కు ఇవ్వొద్దు.
  
సులువుగా పసిగట్టగలిగే పాస్‌వర్డ్‌లను పెట్టడం మంచిది కాదు. 

 చాలామంది నిత్యం వాడేవే కదా అని.. అన్ని యాప్స్‌కు పాస్‌వర్డ్‌లను సేవ్‌ చేస్తుంటారు. కానీ, ఫోన్‌లో పాస్‌వర్డ్‌లు అలా సేవ్‌ చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

 అన్నింటికి మించి ఫోన్‌లను బయటి వైఫైల సాయంతో కనెక్ట్‌ చేసి.. ఆర్థిక లావాదేవీలను నిర్వహించకూడదు.

పైవన్నీ తెలిసినవే కదా.. చిన్న చిన్న కారణాలే కదా.. వీటితో ఏం జరుగుతుంది లే అనే నిర్లక్ష్యం ‘స్మార్ట్‌ ఫోన్ల’ విషయంలో అస్సలు పనికి కాదు. ఇక ఖరీదైన ఫోన్‌ల విషయంలో స్టోర్‌లకు వెళ్లి రిపేర్‌ చేయించుకోవడం ఉత్తమం. 

>
మరిన్ని వార్తలు