అంధుల స్కూల్‌లో అగ్ని ప్రమాదం.. చిన్నారులు సహా 11 మంది దుర్మరణం

25 Oct, 2022 19:07 IST|Sakshi

కంపాలా: అంధుల పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉగాండాలో జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఉగాండా రాజధాని కంపాలాకు సమీప ముకోనో జిల్లాలో సలామా అంధుల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో కంటిచూపు లేని చిన్నారులు అగ్నిలోనే ఆహుతయ్యారు. వసతి గృహంలో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని పాఠశాల హెడ్‌మాస్టర్‌ ప్రాన్సిస్‌ కిరుబే తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఏడు నుంచి పదేళ్ల వయసు పిల్లలేనని.. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని మరో అధికారి వెల్లడించారు. స్కూల్‌ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అందిరిని కలిచివేశాయి. 

తూర్పు ఆఫ్రికా దేశమైన ఉగాండాలో స్కూల్స్‌లో అగ్ని ప్రమాదాలు ఇటీవల ఎక్కువైనట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కిక్కిరిసిపోయే తరగతి గదులు, విద్యుత్‌ కనెక్షన్లు సరిగా లేకపోవడం వంటివి అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నట్లు అధికారులు పేర్కొన్నాయి. నవంబర్‌, 2018లో దక్షిణ ఉగాండాలోని ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది చిన్నారులు మరణించారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2006లో పశ్చిమ ఉగాండాలో ఇస్లామిక్‌ పాఠశాలలో 13 మంది చిన్నారులు దుర్మరణం చెందారు.

ఇదీ చదవండి: ‘వరల్డ్‌ డర్టీ మ్యాన్‌’.. 67 ఏళ్ల తర్వాత స్నానం.. నెలల వ్యవధిలోనే మృతి

మరిన్ని వార్తలు