Telangana: టికెట్‌ లేకపోతే పార్టీలో ఎందుకుండాలి?

22 Nov, 2022 21:10 IST|Sakshi

పాలేరులో తుమ్మల తర్జన భర్జన

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే టికెట్లని గులాబీ దళపతి కేసిఆర్ ప్రకటించేశారు. మరోవైపు పాలేరులో ఎర్ర జెండా ఎగరేస్తామంటున్నారు తమ్మినేని వీరభద్రం. మరి పాలేరు నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంగతేంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతోంది? టిక్కెట్ దక్కే చాన్స్ లేని తుమ్మల ఖీఖ లోనే ఉంటారా? పార్టీ మారుతారా? తుమ్మల ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది? 

కారులో కష్టంగా ప్రయాణం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు కారులో ఇబ్బందికరమైన ప్రయాణం చేస్తున్నారు. పార్టీలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే పార్టీలో తుమ్మల ఒంటరి అయ్యారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సత్తుపల్లిలో జరిగిన ఎంపీ సన్మాన సభకు పార్టీ నుంచి ఆహ్వానం అందలేదని అందుకే హజరుకాలేదని తుమ్మల ఓపెన్ గానే చెప్పారు. పిలవకుండా వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. ఈ ఘటనతోనే అర్థమవుతోంది, ఖమ్మం టిఆర్ఎస్ లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో? ఆ సభకు తుమ్మలను పిలవకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. 

పొమ్మనలేక పొగబెడుతున్నారా?
ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఒత్తిడితోనే తుమ్మలను పిలవలేదని బహిరంగంగానే చెబుతున్నారు. ఇన్ని అవమానాల మధ్య పార్టీలో ఉండటం కష్టమని తుమ్మల అనుచరులు అంటున్నారు. ఇంకా నాన్చకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలని తుమ్మలకు చెప్పారట. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గాని పాలేరు పరిధిలో గాని జనవరి మాసంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ పెట్టే ఆలోచనలో తుమ్మల ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆఖరులోగా ఈ సభపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టిఆర్ఎస్ లో కొనసాగాలా వద్దా అన్న దానిపై సభలోనే స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 

సిట్టింగ్‌లకే సీట్లంటే ఎసరొచ్చినట్టేనా?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో ఓడినప్పటినుంచీ కారులో తుమ్మల పొలిటికల్ జర్నీ ఇబ్బందికరంగా సాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరడంతో తుమ్మల ఇబ్బందులు మరింతగా పెరిగాయి. గత రెండేళ్ల నుంచి పాలేరులో జరిగే టిఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తుమ్మలకు ఆహ్వనాలు అందడంలేదు. ఏదో పార్టీలో ఉన్నారంటే ఉన్నారు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ లకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇటివల ప్రకటించిన నేపథ్యంలో.. టిక్కెట్‌పై ఎమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డి ధీమాగా ఉన్నారు. అయితే టిఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య పోత్తులు దాదాపు ఖారారు అయ్యాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో పాలేరు సీటు సీపీఎంకి కేటాయించాల్సి ఉంటుంది. 

మేం పోటీ చేస్తామంటున్న కామ్రేడ్స్‌
పాలేరులో ఎర్ర జెండా ఎగరవేస్తామని అక్కడ పోటీ చేద్దామనుంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగంగానే చెప్పారు. ఇన్ని వ్యవహారాల మధ్య ఇక పార్టీలో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని తుమ్మల డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వాజేడులో జరిగిన ఆత్మీయ సభ వరకు ఉన్న ఈక్వేషన్స్..సత్తుపల్లిలో జరిగిన టిఆర్ఎస్ సభ తర్వాతి పరిస్థితులకు చాలా తేడా వచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే టిఆర్ఎస్ వర్గాలు మాత్రం తుమ్మల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్ లో ఉన్నారని.. ఎప్పుడైనా పార్టీ మారే అవకాశం ఉన్నందునే.. పార్టీ పక్కన పెట్టిందంటూ ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. సత్తుపల్లి సభకు తుమ్మలను పిలకపోవడం కూడ ఇందులో  బాగామేనన్న వాదన కూడా వినిపిస్తుంది. తుమ్మల విషయంలో టిఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు అర్థం అవుతోంది గనుక..ఇక తుమ్మల కూడా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 
పొలిటకల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

 

మరిన్ని వార్తలు