Fact Check: పశుబీమా పక్కాగానే.. నిజాలకు ముసుగేసి రామోజీ క్షుద్ర రాతలు

7 Nov, 2023 05:00 IST|Sakshi

నిజాలకు ముసుగేసి రామోజీ క్షుద్ర రాతలు 

గతంలో 50 : 50 శాతం నిష్పత్తి చొప్పున అమలుచేసేవారు 

టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 1.20 లక్షల పశువులకే బీమా 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక తొలుత పశు నష్టపరిహారం పథకం అమలు 

ఇందులో 77వేల మంది రైతులకు రూ.176.68 కోట్ల పరిహారం పంపిణీ 

మరింత మందికి లబ్ధిచేకూర్చే లక్ష్యంతో వైఎస్సార్‌ పశు బీమా పథకం అమల్లోకి.. 

దారిద్య్రరేఖకు దిగువనున్న వారితో పాటు ఎస్సీ, ఎస్టీల తరఫున ప్రీమియం మొత్తంలో 80శాతం ప్రభుత్వ రాయితీ 

ఈ పథకంలో ఇప్పటికే దాదాపు 1.73 లక్షల మంది పశుపోషకుల నమోదు 

ఇటీవలే 1,076 మందికి రూ.2.12 కోట్ల పరిహారం చెల్లింపు 

సాక్షి, అమరావతి: ఒకరోజు భోజనం చేయకుండా లేదా నిద్రలేకుండా అయినా ఈనాడు రామోజీరావు ఉండగలరేమోగానీ సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కకుండా మాత్రం ఉండలేరు. రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకున్న ఆయన తాజాగా తన క్షుద్ర పత్రికలో పశుబీమాపై తన పైత్యాన్ని ప్రదర్శించారు. వైపరీత్యాలు, ప్రమాదాల్లో మూగ, సన్నజీవాలు మృత్యువాతపడినప్పుడు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే పశుపోషకులకు భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ పశువుల బీమా పథకాన్ని అమలుచేస్తోంది. ఇది సమర్థవంతంగా అమలవుతుంటే వాస్తవాలకు ముసుగేసి ‘పశుబీమా పడకేసింద’ంటూ ఆ రైతులను తప్పు­దారి పట్టించేలా ఈనాడు రోత రాతలు రాస్తోంది.  

బాబు హయాంలో బీమాకు మంగళం.. 
నిజానికి.. గతంలో కేంద్ర ప్రాయోజిత పథకం కింద పశువులు, సన్నజీవాల కోసం అమలుచేసిన బీమా పథకానికి నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 50 శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉండగా, మిగిలిన 50 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. 2015 తర్వాత కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ నిలిపివేయడంతో చంద్రబాబు హయాంలో ఈ బీమా పథకాన్ని పూర్తిగా అటకెక్కించేశారు. అప్పట్లో కేవలం 1.20 లక్షల పశువులకు మాత్రమే బీమాను వర్తింపజేశారు.

వరదలు, తుపానులు వచ్చినప్పుడు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధల మేరకు అరకొరగా అతికొద్ది మందికి మాత్రమే పరిహారం ఇచ్చేవారు. మిగిలిన సమయాల్లో రోడ్డు, రైలు, అగ్ని ప్రమాదాలు, వడగాడ్పులు, పిడుగుపాటుకు, అడవి జంతువులు, విషప్రయోగాలు, పాముకాట్లు వంటి వాటివల్ల చనిపోయే జీవాలకు పైసా పరిహారం కూడా దక్కేది కాదు. కనీసం బీమా చేయించాలన్న ఆలోచన కూడా గత టీడీపీ ప్రభుత్వం చేయలేదు.  

ఇప్పుడు పశుపోషకులకు భరోసా
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వైపరీత్యాలు, ప్రమాదాల్లో చనిపోయిన మూగ, సన్న­జీ­వాలవల్ల జీవనోపాధి కోల్పో­యిన పశు పోషకులకు నష్టపరిహారం చెల్లించారు. వ్యక్తిగతంగా బీమా చేయించుకునే పశుపోషకులకు భరోసా కల్పించారు. ఇలా నాలుగేళ్లుగా ఈ పథకం కింద ఏకంగా 77వేల మంది పశుపోషకులకు వైఎస్సార్‌ పశు నష్టపరిహారం పథకం కింద నేరుగా వారి ఖాతాల­కు రూ.176.68 కోట్లు జమచేశారు.

మరింత మందికి లబ్ధిచేకూర్చాలన్న సంకల్పంతో 2022–23 నుంచి వైఎస్సా­ర్‌ పశుబీమా పథకం తీసుకొచ్చారు. దీనికింద.. దారిద్య్రరేఖకు దిగువనున్న వారితో పాటు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన పశుపోషకులకు తమ జీవాలకు మూడేళ్ల కాలపరిమితికి నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 80 శాతం ప్రభుత్వ రాయితీగా భరిస్తోంది.

లబ్ధిదారులు తమ వాటా కింద 20 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఏటా రెన్యువల్‌ చేసుకునే ఇబ్బందిలేకుండా మూడేళ్లకు ఒకేసారి ప్రీమి­యం చెల్లించేలా పథకాన్ని రూపొందించారు. కేంద్ర ప్రభు­త్వ ఉత్తర్వుల ప్రకారం మూడేళ్లకు సాధారాణ ప్రాం­తాల్లో ప్రీమియం 11 శాతంగా నిర్ధారించగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 6.40 శాతానికే అందిస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత తక్కువ ప్రీమియంలేదు. పాడి రైతులు కావాలనుకుంటే తమ పశువులకు రూ.30­వేల నుంచి రూ.1.20లక్షల వరకు బీమా చేయించుకోవచ్చు. ప్రభు­త్వ రాయితీ మాత్రం రూ.30 వేలకే వర్తిస్తుంది. మిగిలిన ప్రీమియం మొత్తం చెల్లించుకుంటే సరిపోతుంది.  

80శాతం రాయితీ వర్తింపు.. 
ఇక పశు పోషకులలో ఎక్కువమంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారే. వీరిలో ఎస్సీ, ఎస్టీలతో పాటు దారిద్య్రరేఖకు దిగువనున్న బీసీలందరికీ 80శాతం రాయితీ వర్తిస్తుంది. ఇప్పటివరకు ఈ పథకంలో 1,72,815 మంది పశు పోషకులు నమోదు చేసుకున్నారు. వీరికోసం రూ.16.43 కోట్లను ప్రభుత్వం ప్రీమియం రూపంలో చెల్లించింది. వైపరీత్యాలు, ప్రమాదాల్లో పశువులను కోల్పోయిన 1,076 మంది పశుపోషకులకు రూ.2.12 కోట్ల బీమా పరిహారాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఇవేవీ కనిపించని రామోజీ రోజూ క్షుద్ర వార్తలను వండి తన పాఠకుల మీద రుద్దుతున్నారు.  

పశు బీమాకు ఢోకాలేదు.. 
రాష్ట్రంలో వైఎస్సార్‌ పశుబీమా పథకానికి ఢోకాలేదు. గతంలో ఎన్నడూలేని విధంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ నిర్దేశిత గడువులోగా పరిహారం ఇస్తున్నాం. ఈ పథకం ఆపలేదు.. ఆగలేదు. దీనికి ప్రభుత్వం రూ.55 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తంలో లబ్ధిదారులు తమ వాటాగా రూ.15 కోట్లు చెల్లిస్తుండగా, కేంద్రం రూ.20కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.20కోట్లు సర్దుబాటు చేస్తోంది. కేంద్రం చెల్లించాల్సిన వాటాకు సంబంధించి రూ.63.12 కోట్లు రావాల్సి ఉంది. అవి అందిన వెంటనే మరింత వేగంగా అమలుచేస్తాం. 
– డాక్టర్‌ అమరేంద్రకుమార్,డైరెక్టర్, పశుసంవర్థక శాఖ  

మరిన్ని వార్తలు