సచిన్‌ తనయుడికి మరో అవమానం.. ముంబై రంజీ జట్టులోనూ నో ప్లేస్‌

24 May, 2022 14:01 IST|Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండా బెంచ్‌కే పరిమితమైన సచిన్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌కు మరో అవమానం జరిగింది. రంజీ నాకౌట్స్‌ కోసం ప్రకటించిన ముంబై జట్టులో అతని స్థానం గల్లంతైంది. ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ అజింక్య రహానేతో పాటు ముంబై జట్టులో చోటు దక్కించుకున్న అర్జున్‌ను.. కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌కు పక్కకు పెట్టారు. 

ముంబై తరఫున టీ20ల్లో మాత్రమే అరంగేట్రం చేసిన అర్జున్‌.. ఈ సీజన్‌ నాకౌట్‌ మ్యాచ్‌ ద్వారా ఎలాగైనా ఫస్ట్‌ క్లాస్‌  క్రికెట్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. అయితే సెలెక్టర్లు అతని ఆశలను అడియాశలు చేశారు. ఐపీఎల్‌లో 30 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించకుండా అవమానించగా.. తాజాగా ముంబై రంజీ టీమ్‌ కూడా అదే తరహాలో అర్జున్‌పై శీతకన్ను వేసింది. 

కాగా, జూన్‌లో జ‌రిగే రంజీ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌ కోసం ఇవాళ ముంబై జట్టును ప్రకటించారు. బెంగుళూరు వేదిక‌గా ఉత్త‌రాఖండ్‌తో తలపడే ముంబై జ‌ట్టుకు పృథ్వీ షా నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. గాయం కారణంగా సీనియర్‌ ప్లేయర్‌ రహానే ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. యశస్వి జైస్వాల్‌, స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, అర్మాన్ జాఫ‌ర్‌ (వసీం జాఫర్‌ మేనల్లుడు), ధావ‌ల్ కుల‌క‌ర్ణి, తుషార్ దేశ్‌పాండే తదితరులు జట్టులో చోటు దక్కించుకున్నారు. 

ముంబై రంజీ జ‌ట్టు: పృథ్వీ షా(కెప్టెన్‌), య‌శ‌స్వి జైస్వాల్‌, భూపేన్ లాల్వానీ, అర్మాన్ జాఫ‌ర్‌, స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, సువేద్ పార్క‌ర్‌, ఆక‌ర్షిత్ గోమ‌ల్‌, ఆదిత్య తారే, హార్ధిక్ త‌మోర్‌, అమాన్ ఖాన్‌, సాయిరాజ్ పాటిల్‌, షమ్స్ ములానీ, దృమిల్ మ‌ట్క‌ర్‌, త‌నుష్ కోటియాన్‌, శ‌శాంక్ అతార్డే, ధవ‌ల్ కుల‌క‌ర్ణి, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తీ, రొస్తాన్ డ‌యాస్‌, సిద్ధార్థ్‌ రౌత్‌, ముషీర్ ఖాన్.
చదవండి: ధావన్‌ ఎంపికలో అన్యాయం.. కేఎల్‌ రాహుల్‌ జోక్యంలో నిజమెంత?

మరిన్ని వార్తలు