Asian Games 2023: అదే జోరు...

3 Oct, 2023 04:24 IST|Sakshi

ఆసియా క్రీడల్లో కొనసాగుతున్న భారత్‌ పతకాల వేట

మూడు రజతాలు, ఒక కాంస్యం అందించిన అథ్లెట్స్‌

రోలర్‌ స్కేటింగ్, టేబుల్‌ టెన్నిస్‌లో కాంస్యాలు  

వంద పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాకారుల బృందం ఆ దిశగా సాగుతోంది. పోటీలు మొదలైన తొలి రోజు నుంచే పతకాల వేట మొదలు పెట్టిన భారత క్రీడాకారులు దానిని వరుసగా తొమ్మిదోరోజూ కొనసాగించారు. ఆదివారం ఈ క్రీడల చరిత్రలోనే ఒకేరోజు అత్యధికంగా 15 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం ఏడు పతకాలతో అలరించారు.

అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న అథ్లెట్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించగా... ఎవరూ ఊహించని విధంగా రోలర్‌ స్కేటింగ్‌లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. మహిళల టేబుల్‌ టెన్నిస్‌ డబుల్స్‌లో సుతీర్థ–అహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనకు కాంస్య పతకంతో తెరపడింది. ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వా‹Ùలోనూ భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యం చాటుకొని పతకాల రేసులో ముందుకెళ్లారు. తొమ్మిదో రోజు తర్వాత ఓవరాల్‌గా భారత్‌ 13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 60 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.   

హాంగ్జౌ: షూటర్ల పతకాల వేట ముగిసినా వారిని స్ఫూర్తిగా తీసుకొని భారత అథ్లెట్స్‌ ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. సోమవారం భారత్‌ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. అందులో అథ్లెట్స్‌ మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి నాలుగు అందించారు. రోలర్‌ స్కేటింగ్‌లో రెండు కాంస్యాలు, టేబుల్‌ టెన్నిస్‌లో ఒక కాంస్యం దక్కింది.  

మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఆసియా చాంపియన్, భారత స్టార్‌ పారుల్‌ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్‌కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్‌ యావి విన్‌ఫ్రెడ్‌ ముతిలె తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. కెన్యాలో జని్మంచిన 23 ఏళ్ల యావి విన్‌ఫ్రెడ్‌ 2016లో బహ్రెయిన్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో బహ్రెయిన్‌ తరఫున పోటీపడుతోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకం నెగ్గిన యావి విన్‌ఫ్రెడ్‌ ఈసారీ తన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. యావి విన్‌ఫ్రెడ్‌ 9ని:18.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలువగా... పారుల్‌ 9ని:27.63 సెకన్లతో రెండో స్థానాన్ని... ప్రీతి 9ని:43.32 సెకన్లతో మూడో స్థానాన్ని సంపాదించారు.  

ఆన్సీ అదుర్స్‌...
మహిళల లాంగ్‌జంప్‌లో కేరళకు చెందిన 22 ఏళ్ల ఆన్సీ సోజన్‌ ఇడపిలి రజత పతకంతో సత్తా చాటుకుంది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆన్సీ సోజన్‌ 6.63 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. షికి జియాంగ్‌ (చైనా; 6.73 మీటర్లు) స్వర్ణం... యాన్‌ యు ఎన్గా (హాంకాంగ్‌; 6.50 మీటర్లు) కాంస్యం గెలిచారు. భారత్‌కే చెందిన శైలి సింగ్‌ (6.48 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది.

రిలే జట్టుకు రజతం...
4గీ400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో భారత జట్టుకు రజత పతకం లభించింది. అజ్మల్, విత్యా రామ్‌రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్‌ రేసును 3ని:14.34 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శ్రీలంక జట్టు 3ని:14.25 సెకన్లతో రజతం గెలిచింది. అయితే రేసు సందర్భంగా శ్రీలంక అథ్లెట్‌ నిబంధనలకు విరుద్ధంగా వేరే బృందం పరిగెడుతున్న లైన్‌లోకి వచ్చాడని తేలడంతో నిర్వాహకులు శ్రీలంక జట్టుపై అనర్హత వేటు వేశారు.

దాంతో భారత జట్టు పతకం కాంస్యం నుంచి రజతంగా మారిపోయింది. నాలుగో స్థానంలో నిలిచిన కజకిస్తాన్‌కు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్‌లో బహ్రెయిన్‌ జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్‌ అమ్లాన్‌ బొర్గోహైన్‌ 20.60 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల పోల్‌వాల్ట్‌లో భారత క్రీడాకారిణి పవిత్ర వెంకటేశ్‌ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో ఐదు ఈవెంట్‌లు ముగిశాక భారత ప్లేయర్‌ తేజస్విన్‌ శంకర్‌ 4260 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 

మరిన్ని వార్తలు