Times Now Survey : ‘ఫ్యాన్‌’ ప్రభంజనం! | Sakshi
Sakshi News home page

Times Now Survey : ‘ఫ్యాన్‌’ ప్రభంజనం!

Published Tue, Oct 3 2023 4:19 AM

Times Now Survey: YSR Congress Party sure to win all 25 MP seats - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా మారిన రాజకీయ పరిస్థితులు, కొత్త సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘టైమ్స్‌ నౌ’ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 51.10 శాతం ఓట్లను సాధించి 25కిగానూ 25 లోక్‌సభ స్థానాలనూ దక్కించుకోవడం ద్వారా వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని తేల్చింది. ఫ్యాన్‌ తుపాన్‌లో టీడీపీ, జనసేన, ఎన్డీయే, ఇతర పక్షాలు గల్లంతు కావడం ఖాయమని స్పష్టం చేసింది.

అవినీతి కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్న నేపథ్యంలో టీడీపీ 36.40 శాతం ఓట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. ప్రజల్లో సానుభూతి పొందేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు ఫలించలేదని, టీడీపీ ఒక్క లోక్‌సభ స్థానంలోనూ విజయం సాధించే అవకాశం లేదని.. ఒక ఎంపీ స్థానంలో మాత్రమే ఒకింత ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన 10.1 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటుందని, ఒక్క లోక్‌సభ స్థానంలో కూడా కనీసం పోటీని ఇవ్వలేదని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో బీజేపీ 1.30 శాతం ఓట్లకు పరిమితం కాగా సీపీఐ, సీపీఎం సహా వామపక్షాలు 1.10 శాతం ఓట్లకు పరిమితం అవుతాయని పేర్కొంది. 

అధికార పార్టీకి మరింత పెరిగిన ఆదరణ
దేశంలో అన్ని రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల అభిప్రాయంపై టైమ్స్‌ నౌ సంస్థ తాజాగా విస్తృతంగా సర్వే చేసింది. సర్వేకు సంబంధించిన ఫలితాలను సోమవారం రాత్రి టైమ్స్‌ నౌ చానల్‌ ప్రసారం చేసింది. విశ్లేషకులతో చర్చ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో 22 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 24–25 ఎంపీ స్థానాల్లో విజయభేరీ మోగిస్తుందని సర్వేలో వెల్లడైందని వ్యాఖ్యాత పద్మజాజోషి వెల్లడించారు. గత 52 నెలలుగా సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ మరింత పెరిగిందని విశ్లేషించారు. అందుకే అధికార పార్టీ 22 లోక్‌సభ స్థానాల నుంచి 25 ఎంపీ సీట్లలో క్లీన్‌ స్వీప్‌ చేసి తిరుగులేని విజయం సాధించే స్థాయికి చేరుకుందని తెలిపారు.


విశ్వసనీయతకు పట్టం..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసే స్థాయికి దారితీసిన పరిస్థితులపై టైమ్స్‌ నౌ ఛానల్‌ చర్చ నిర్వహించింది. సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయని చర్చలో పాల్గొన్న విశ్లేషకులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు వైఎస్సార్‌సీపీ తిరుగులేని శక్తిగా అవతరించడానికి ప్రధాన కారణమేంటని చర్చలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని వ్యాఖ్యాత పద్మజా జోషి ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో 99.5 శాతం హామీలను సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేశారని అబ్బయ్య చౌదరి గుర్తు చేశారు.

సీఎం జగన్‌ ఏదైనా చెప్పారంటే చేస్తారనేది ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన.. అవినీతికి తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందిస్తుండటం.. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సంస్కరణల ద్వారా అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు. దీన్ని చంద్రబాబు పాలనతో పోల్చుకుంటున్న ప్రజలు సీఎం జగన్‌తోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధ్యమని బలంగా నమ్ముతున్నారని, అందుకే 25కుగానూ 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందన్నది సర్వే ద్వారా తేలిందన్నారు. 

ఫలించని సానుభూతి డ్రామా
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబును జైలుకు పంపడం వల్ల ఆయనపై ప్రజల్లో సానుభూతి ఏమైనా కనిపిస్తోందా? అని చర్చలో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్ట్, కాలమిస్ట్‌ అశుతోష్‌ను వ్యాఖ్యాత పద్మజా జోషి ప్రశ్నించారు. దీనిపై అశుతోష్‌ స్పందిస్తూ.. అవినీతి కేసులో రిమాండ్‌పై జైలులో ఉన్న చంద్రబాబు పట్ల ప్రజల్లో ఏమాత్రం సానుభూతి కనిపించడం లేదని తెలిపారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున అవినీతికి పాల్పడటం వల్లే ఇప్పుడు ప్రజల్లో ఆయన పట్ల సానుకూల అభిప్రాయం లేదని విశ్లేషించారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపారని నారా లోకేష్‌తోపాటు టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు విశ్వసించడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబులో ఇప్పటికైనా మార్పు రావాలని, ఆయన వైఖరిపై పునరాలోచించుకోవాలని సూచించారు. 

2019 కంటే మిన్నగా..
2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో విజ­యకేతనం ఎగురవేయడం ద్వారా వైఎస్సార్‌సీపీ రికార్డు సృష్టించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేయడం ద్వారా సీఎం జగన్‌ దేశం దృష్టిని ఆకర్షించారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథాన అగ్రభాగాన నిలబెట్టారు. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారు.

గత 52 నెలల్లో సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో రూ.2.36 లక్షల కోట్లను జమ చేశారు. వ్యవసాయ, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక సంస్కరణలను తెచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తూ సుపరిపాలన అందిస్తున్నారు. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది.

2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయాలు సాధించడమే అందుకు తార్కాణం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 2019 ఎన్నికల కంటే మిన్నగా అంటే 51.10 శాతం ఓట్లతో 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని టైమ్స్‌ నౌ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ‘వైనాట్‌ 175..?’ అని ముఖ్యమంత్రి జగన్‌ పదే పదే చెబుతున్న అంశాలకు ఈ సర్వే ఫలితాలు దగ్గరగా ఉండటం గమనార్హం. 

Advertisement
Advertisement