Novak Djokovic: వరుసగా 27వ విజయం.. పదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో

27 Jan, 2023 16:57 IST|Sakshi

సెర్బియా టెన్నిస్‌ స్టార్‌.. వరల్డ్‌ నెంబర్‌ ఐదో ర్యాంకర్‌.. నొవాక్‌ జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. కాగా జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్స్‌కు వెళ్లడం ఇది పదోసారి. శుక్రవారం అమెరికాకు చెందిన 35వ ర్యాంకర్‌ టామీ పాల్‌ను 7-5, 6-1,6-2 తేడాతో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు.

తొలి సెట్‌ నుంచే జొకోవిచ్‌ బలమైన సర్వీస్‌లతో విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని జొకోవిచ్‌ మ్యాచ్‌ మొత్తంలో ఏడు బ్రేక్‌ పాయింట్స్‌ సాధించడం విశేషం. ఇప్పటికే రికార్డు స్థాయిలో తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌స్లామ్‌ కొల్లగొట్టిన జొకోవిచ్‌ 10వ టైటిల్‌పై కన్నేశాడు. అంతేకాదు 21 కెరీర్‌ గ్రాండ్‌స్లామ్స్‌తో రెండో స్థానంలో ఉన్న జొకోవిచ్‌.. స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌(22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌) సమం చేయడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు.

మరో విషయం ఏంటంటే.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన ప్రతీసారి జొకోవిచ్‌ టైటిల్‌ కొల్లగొట్టడం విశేషం. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో జొకోవిచ్‌ మరో రికార్డు కూడా అందుకున్నాడు. ఇప్పటివరకు 27 మ్యాచ్‌లుగా ఓటమనేదే లేకుండా జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో దూసుకెళ్తున్నాడు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో గ్రీక్‌ టెన్నిస్‌ స్టార్‌ సిట్సిపాస్‌తో జొకోవిచ్‌ అమితుమీ తేల్చుకోనున్నాడు.

ఇంటిబాట పట్టిన కచనోవ్‌.. ఫైనల్‌కు సిట్సిపాస్‌


అంతకముందు జరిగిన మరో సెమీస్‌ పోరులో గ్రీక్‌ టెన్నిస్‌ స్టార్‌ స్టెపానోస్‌ సిట్సిపాస్‌(ప్రపంచ నాలుగో ర్యాంకర్‌).. రష్యాకు చెందిన కచనోవ్‌పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో సిట్సిపాస్‌.. కచనోవ్‌ను  7-6(7-2), 6-4,6-7(8-6), 6-3 తేడాతో మట్టికరిపించాడు.

మరిన్ని వార్తలు