Ind Vs Aus: జడ్డూ లేకుంటే టీమిండియా బలహీనపడుతుందనుకుంటే.. అతడేమో ఇలా: ఆసీస్‌ కోచ్‌

26 Sep, 2022 13:58 IST|Sakshi

Australia tour of India, 2022- Ind Vs Aus 3rd T20- Hyderabad: టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌పై ఆస్ట్రేలియా కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ ప్రశంసలు కురిపించాడు. ఆసీస్‌తో సిరీస్‌ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. రవీంద్ర జడేజా లేని లోటు టీమిండియాకు బలహీనతగా మారుతుందనుకుంటే.. అక్షర్‌ రూపంలో వారికి మంచి ప్రత్యామ్నాయం దొరికిందని పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్‌-2022 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడింది. 2-1తో ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా గాయం కారణంగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ జడేజా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.

అదరగొట్టిన అక్షర్‌ పటేల్‌.. ఆసీస్‌ కోచ్‌ ప్రశంసలు
ఈ నేపథ్యంలో అక్షర్‌ పటేల్‌ జట్టులోకి వచ్చాడు. మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అందుకు తగ్గట్టుగా రాణించాడు ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. మొదటి మ్యాచ్‌లో 3, రెండో మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన అక్షర్‌ పటేల్‌.. నిర్ణయాత్మక మూడో టీ20లో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.


ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌(PC: CA)

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన మూడో టీ20 అనంతరం మీడియాతో మాట్లాడిన ఆసీస్‌ కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ అక్షర్‌ పటేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘ఈ సిరీస్‌లో అక్షర్‌ అదరగొట్టాడు. జడ్డూ లేకుంటే భారత జట్టు బలహీనపడుతుందని భావిస్తే అక్షర్‌ ఆ లోటును పూడ్చాడు’’ అని పేర్కొన్నాడు.

అదే విధంగా సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని.. ప్రపంచకప్‌ టోర్నీలో అతడు ప్రమాదకర బ్యాటర్‌గా మారి సవాల్‌ విసరగలడని పేర్కొన్నాడు. కాగా ఆఖరి టీ20లో రోహిత్‌ సేన ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌ అర్ధ శతకాలతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు.

చదవండి: Ind Vs Aus: మ్యాచ్‌కు ముందు కడుపునొప్పి, జ్వరం! లెక్కచేయని సూర్య! ఇదే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అయితే!

మరిన్ని వార్తలు