ఆఖరి బంతికి సిక్సర్‌.. ఉత్కంఠపోరులో భారత్‌ విజయం

24 Nov, 2023 05:05 IST|Sakshi

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన సూర్యకుమార్‌

రాణించిన ఇషాన్

ఆఖరి బంతికి సిక్సర్‌ కొట్టిన రింకూ సింగ్‌

తొలి టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి

ఇన్‌గ్లిస్‌ సెంచరీ వృథా

26న రెండో టి20 మ్యాచ్‌  

సాక్షి, విశాఖపట్నం: పరుగుల వరద పారిన మ్యాచ్‌లో చివరికి భారత జట్టుదే పైచేయిగా నిలిచింది. ఆ్రస్టేలియాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం ఇక్కడి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌–ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వంలోని భారత జట్టు రెండు వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా జట్టును ఓడించింది. తొలిసారి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మ్యాచ్‌లో సూర్యకుమార్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు సాధించింది.

జోష్‌ ఇంగ్లిస్‌ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించగా... ఓపెనర్‌గా వచ్చిన స్టీవ్‌ స్మిత్‌ (41 బంతుల్లో 52; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. ఇన్‌గ్లిస్‌ 47 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో ఆ్రస్టేలియా తరఫున టి20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఆరోన్‌ ఫించ్‌ (47 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.

అనంతరం భారత జట్టు 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెపె్టన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)– అర్ధ సెంచరీలతో అదరగొట్టగా... రింకూ సింగ్‌ (14 బంతుల్లో 22 నాటౌట్‌; 4 ఫోర్లు) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.

భారత్‌ విజయానికి ఆఖరి బంతికి ఒక పరుగు అవసరంకాగా... సీన్‌ అబాట్‌ వేసిన బంతిని రింకూ సింగ్‌ సిక్సర్‌గా మలిచి భారత విజయాన్ని ఖరారు చేశాడు. అయితే టీవీ రీప్లేలో అబాట్‌ వేసిన బంతి నోబాల్‌ అని తేలడంతో అక్కడే భారత విజయం ఖాయమైంది. దాంతో రింకూ సింగ్‌ సిక్స్‌ను లెక్కలోకి తీసుకోలేదు. టి20ల్లో భారత జట్టుకిదే అత్యధిక ఛేజింగ్‌ కావడం విశేషం. సిరీస్‌లోని రెండో టి20 మ్యాచ్‌ ఈనెల 26న తిరువనంతపురంలో జరుగుతుంది.  

సూర్య, ఇషాన్‌ ధనాధన్‌ 
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (8 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో సమన్వయలోపం కారణంగా మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (0) ఒక్క బంతి ఆడకుండానే తొలి ఓవర్లోనే రనౌటయ్యాడు. అనంతరం మూడో ఓవర్లో యశస్వి భారీ షాట్‌కు యత్నించి నిష్క్రమించాడు. ఈ దశలో ఇషాన్, సూర్యకుమార్‌ జత కలిశారు.

వీరిద్దరు ఎక్కడా తగ్గకుండా ఆసీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో భారత్‌ స్కోరు 4.5 ఓవర్లలో 50 దాటింది. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్‌ 2 వికెట్లకు 63 పరుగులు సాధించింది. ఆ తర్వాత కూడా ఇషాన్, సూర్య జోరు కొనసాగించడంతో భారత్‌ 9.1 ఓవర్లలో 100 పరుగులు చేసింది. ఇషాన్‌ 37 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో భారీ షాట్‌కు యత్నించి డీప్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో షార్ట్‌ చేతికి చిక్కడంతో ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. తిలక్‌ వర్మ (10 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయాడు. ఈ దశలో సూర్య, రింకూ జతకలిసి ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించడంతో భారత్‌ 194/4తో విజయానికి చేరువైంది. అయితే ఇదే స్కోరు వద్ద సూర్య అవుటయ్యాడు. అప్పటికి భారత్‌ విజయానికి చేరువైంది.  

చివరి ఓవర్‌ డ్రామా... 
12 బంతుల్లో 14 పరుగులు చేయాల్సిన దశలో 19వ ఓవర్లో భారత్‌ 7 పరుగులు చేసింది. దాంతో చివరి ఓవర్లో భారత్‌ గెలుపునకు 6 బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. తొలి బంతికే రింకూ ఫోర్‌ కొట్టాడు. రెండో బంతికి ‘బై’ రూపంలో పరుగు వచ్చింది. 4 బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన దశలో భారత్‌ వరుసగా మూడు బంతుల్లో అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్‌ వికెట్లను కోల్పోయింది.

రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో అర్ష్దీప్‌ అవుటయ్యాడు. దాంతో చివరి బంతికి భారత్‌ విజయానికి ఒక పరుగు అవసరమైంది. ‘సూపర్‌ ఓవర్‌’ అవసరం పడుతుందా అనే అనుమానం కలిగిన దశలో అబాట్‌ వేసిన ఆఖరి బంతిని రింకూ సిక్స్‌గా మలచడంతో భారత్‌ విజయం ఖరారైంది. అయితే అబాట్‌ బంతి నోబాల్‌ అని తేలడంతో రింకూ సిక్స్‌ షాట్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. 

స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: స్టీవ్‌ స్మిత్‌ (రనౌట్‌) 52; మాథ్యూ షార్ట్‌ (బి) రవి బిష్ణోయ్‌ 13; జోష్‌ ఇన్‌గ్లిస్‌ (సి) యశస్వి జైస్వాల్‌ (బి) ప్రసిధ్‌ 
కృష్ణ 110; స్టొయినిస్‌ (నాటౌట్‌) 7; టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–31, 2–161, 3–180. బౌలింగ్‌: అర్ష్దీప్‌ సింగ్‌ 4–0–41–0, ప్రసిధ్‌ కృష్ణ 4–0–50–1, అక్షర్‌ పటేల్‌ 4–0–32–0, రవి బిష్ణోయ్‌ 4–0–54–1, ముకేశ్‌ కుమార్‌ 4–0–29–0. 

భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి జైస్వాల్‌ (సి) స్మిత్‌ (బి) షార్ట్‌ 21; రుతురాజ్‌ గైక్వాడ్‌ (రనౌట్‌) 0; ఇషాన్‌ కిషన్‌ (సి) షార్ట్‌ (బి) తన్వీర్‌ 58; సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) ఆరన్‌ హార్డి (బి) బెహ్రన్‌డార్ఫ్‌ 80; తిలక్‌ వర్మ (సి) స్టొయినిస్‌ (బి) తన్వీర్‌ సంఘా 12; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 22; అక్షర్‌ పటేల్‌ (సి అండ్‌ బి) సీన్‌ అబాట్‌ 2; రవి బిష్ణోయ్‌ (రనౌట్‌) 0; అర్ష్దీప్‌ సింగ్‌ (రనౌట్‌) 0; ముకేశ్‌ కుమార్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.5 ఓవర్లలో 8 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–11, 2–22, 3–134, 4–154, 5–194, 6–207, 7–207, 8–208. బౌలింగ్‌: స్టొయినిస్‌ 3–0–36–0, బెహ్రన్‌డార్ఫ్‌ 4–1–25–1, షార్ట్‌ 1–0–13–1, సీన్‌ అబాట్‌ 3.5–0–43–1, నాథన్‌ ఎలిస్‌ 4–0–44–0, తన్వీర్‌ సంఘా 4–0–47–2.

మరిన్ని వార్తలు