భారత్‌-ఆసీస్‌ తొలి టీ20.. వైజాగ్‌లో వాతావరణ పరిస్థితి ఏంటి..?

23 Nov, 2023 10:45 IST|Sakshi

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వైజాగ్‌లోని వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వైజాగ్‌లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా వైజాగ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

మ్యాచ్‌ జరిగే సమయానికి వర్షం పడే అవకాశాలు ఉండటంతో టాస్‌ ఆలస్యమవ్వవచ్చని స్థానికులు అంటున్నారు. వర్షం కారణంగా మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదమేమీ లేనప్పటికీ, ప్రస్తుత వాతావరణ పరిస్థితి మాత్రం కాస్త ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం. 

కాగా, భారత సెలెక్టర్లు ప్రధాన ఆటగాళ్లకంతా విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్‌లో యువ జట్టు బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వం వహించనున్నాడు. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఎదురైన పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న భారత క్రికెటర్లు.. వైజాగ్‌ టీ20లో ఆసీస్‌ను మట్టికరిపించాలని పట్టుదలగా ఉన్నారు.

ఈ సిరీస్‌ కోసం​ ఆసీస్‌ సైతం కొందరు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించింది. వరల్డ్‌కప్‌ అనంతరం కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, వెటరన్‌ డేవిడ్‌ వార్నర్‌, పేసర్లు స్టార్క్‌, హాజిల్‌వుడ్‌, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ సిరీస్‌లో మాథ్యూ వేడ్‌ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్‌, ట్రవిస్‌ హెడ్‌, ఆడమ్‌ జంపా దూరంగా ఉండనున్నారని సమాచారం.

తుది జట్లు (అంచనా)..
భారత్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్ ), ఇషాన్‌ కిషన్, యశస్వి/రుతురాజ్, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే, రింకూ సింగ్, అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్‌ సింగ్, ప్రసిధ్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్‌.  

ఆస్ట్రేలియా: మాథ్యూ వేడ్‌ (కెప్టెన్ ), స్మిత్, షార్ట్, హార్డీ, ఇన్‌గ్లిస్, స్టొయినిస్, టిమ్‌ డేవిడ్, సీన్‌ అబాట్, ఎలిస్, బెహ్రన్‌డార్ఫ్‌, తన్విర్‌ సంఘా.

మరిన్ని వార్తలు