AUS vs SA 1st T20I: మిచెల్‌ మార్ష్‌ ఊచకోత.. డేవిడ్‌ విధ్వంసం! దక్షిణాఫ్రికా చిత్తు

31 Aug, 2023 07:29 IST|Sakshi

దక్షిణాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. డర్బన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 111 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ విధ్వంసం సృష్టించాడు.

క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రోటీస్‌ బౌలర్లపై మార్ష్‌ విరుచుకుపడ్డాడు. కింగ్స్‌మేడ్‌ మైదానంలో మార్ష్‌ బౌండరీలు వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా 49 బంతులు ఎదుర్కొన్న మిచెల్‌.. 13 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 92 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ఇక మార్ష్‌తో పాటు టిమ్‌ డేవిడ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. ప్రోటీస్‌ బౌలర్లలో విలియమ్స్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. జానెసన్‌, గెరాల్డ్‌, షమ్సీ తలా వికెట్‌ సాధించారు.

కుప్పకూలిన ప్రోటీస్‌..
అనంతరం 227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా కేవలం 115 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్‌ సంఘా 4 వికెట్లు, మార్కస్‌ స్టోయినిస్‌ 3 వికెట్లతో ప్రోటీస్‌ను దెబ్బతీశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెండ్రిక్స్‌(56) మినహా అందరూ విఫలమయ్యారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికలో శుక్రవారం జరగనుంది.
చదవండి: Asia Cup 2023: శ్రీలంక గడ్డపై భారత జట్టు

మరిన్ని వార్తలు