ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన బంగ్లా

14 Mar, 2023 19:15 IST|Sakshi

టి20 ప్రపంచ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌ ఎదురైంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌కు టి20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్‌ ముచ్చటగా మూడో టి20 మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. మంగళవారం ఢాకా వేదికగా జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. దీంతో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ ఓటమికి బంగ్లా బదులు తీర్చుకున్నట్లయింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. లిటన్‌దాస్‌(57 బంతుల్లో 73, 10 ఫోర్లు, ఒక సిక్సర్‌) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. షాంటో 47 పరుగులు, రోనీ తలుక్‌దర్‌ 24 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌, క్రిస్‌ జోర్డాన్‌లు చెరొక వికెట్‌ తీశారు.  అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్‌ మలాన్‌ 53 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జోస్‌ బట్లర్‌ 40 పరుగులు చేశాడు.

అయితే వీరిద్దరు మినహా మిగతవారు రాణించడంలో విఫలం కావడం.. బంగ్లా బౌలర్లు ఆఖర్లో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ రెండు వికెట్లు తీయగా.. తన్విర్‌ ఇస్లామ్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. హాఫ్‌ సెంచరీతో రాణించిన లిటన్‌దాస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. నజ్ముల్‌ హొసెన్‌ షాంటో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును కైవసం చేసుకున్నాడు.

చదవండి: 'ఐపీఎల్‌ మధ్యలోనే ఆటగాళ్లను ఇంగ్లండ్‌కు పంపిస్తాం'

మరిన్ని వార్తలు