-

అగార్కర్‌ బృందం కసరత్తు.. ఆరోజే రోహిత్‌, కోహ్లి టీ20 భవితవ్యం తేలేది! ఇప్పుడు కాకుంటే..

28 Nov, 2023 19:32 IST|Sakshi

టీమిండియా ఈ ఏడాది చివరి విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లనుంది. ప్రొటిస్‌ గడ్డపై డిసెంబరు 10 నుంచి దాదాపు నెల రోజుల పాటు సుదీర్ఘ పర్యటన కొనసాగించనుంది.

టీ20 సిరీస్‌తో మొదలుపెట్టి టెస్టు సిరీస్‌తో జనవరిలో ఈ టూర్‌ను ముగించనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. వచ్చే వారం ఇందుకు సంబంధించి జట్టు ఎంపికను పూర్తి చేయన్నుట్లు తెలుస్తోంది. అదే విధంగా సెలక్షన్‌ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

వన్డే వరల్డ్‌కప్‌-2023కి సన్నద్ధమయ్యే క్రమంలో గతేడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, ఇకపై వారిద్దరు పొట్టి ఫార్మాట్‌కు అందుబాటులో ఉంటారో లేదోనన్న విషయంపై అజిత్‌ అగార్కర్‌ బృందం తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌-2024కి షెడ్యూల్‌ ఖరారైన తరుణంలో ‘విరాహిత్‌’ ద్వయం కొనసాగుతారా లేదోనన్న అంశంపై తేల్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు గనుక వీరిద్దరు​ అందుబాటులో ఉంటే ప్రపంచకప్‌ ఆడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఇక ఇంటర్నేషనల్‌ టీ20లలకు 36 ఏళ్ల రోహిత్‌, 35 ఏళ్ల కోహ్లి వీడ్కోలు పలికినట్లే అర్థమంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

ఈ విషయంపై సోమవారం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు ఇన్‌సైడ్‌స్పోర్ట్‌కు వెల్లడించాయి. కాగా రోహిత్‌ టీ20లతో పాటు వన్డేలకూ దూరం కానుండగా.. కోహ్లి చాంపియన్స్‌ ట్రోఫీ-2025 వరకు కొనసాగనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సౌతాఫ్రికా టూర్‌ సందర్భంగా ఈ ఇద్దరిని టీమిండియా తరఫున టీ20లలో చూస్తామా లేదా అన్నది తేలే ఛాన్స్‌ ఉంది. 

చదవండి: సచిన్‌ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! ఇప్పుడు..

మరిన్ని వార్తలు