'ఇతరుల బ్యాట్లు ప‌క్కింటి వ్య‌క్తి భార్య‌లాంటివి..' డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

2 Jul, 2021 18:57 IST|Sakshi

లండన్: బ్యాట్లు ప‌క్కింటి వ్య‌క్తి భార్య‌లాంటివని, అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయని టీమిండియా మాజీ వికెట్ కీపర్, ప్రస్తుత వ్యాఖ్యాత దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ద్వారా క్రికెట్‌ వ్యాఖ్యాతగా మారిన డీకే.. బ్యాట్స్‌మెన్‌, బ్యాట్ల మ‌ధ్య రిలేష‌న్‌షిప్ గురించి మాట్లాడుతున్న సంద‌ర్భంలో ఈ రకంగా స్పందించాడు. బ్యాట్స్‌మెన్‌కు తమ బ్యాట్లు న‌చ్చ‌క‌పోవ‌డం అనేది చాలా కామ‌న్‌ విషయమని, ఇతర బ్యాట్స్‌మెన్లు వాడే బ్యాట్లపై వారికి విపరీతమైన మోజు ఉంటుందని, ఓ విధంగా చెప్పాలంటే ఇతరుల బ్యాట్లు ప‌క్కింటి వ్య‌క్తి భార్య‌లాంటివి, అవి ఎప్పుడూ చాలా బాగా అనిపిస్తాయని కార్తీక్ సరదాగా అన్నాడు. 

కార్తీక్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన వ్యక్తిగత విషయాలు గుర్తుకువచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడేమోనని కామెంట్లు చేస్తున్నారు. సాధార‌ణంగా హ‌ర్షా భోగ్లే, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్‌ తమ కామెంట‌రీలో ఇలాంటి స‌ర‌దా విష‌యాలను ప్రస్తావించి ప్రేక్షకులను న‌వ్విస్తుంటారు.

ఇదిలా ఉంటే, వ్యాఖ్యాతగా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టడానికి గల కారణాలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో వెల్లడించాడు. 'వ్యాఖ్యాతగా మారడం అనేది మాటల్లో వర్ణించలేనని, క్రికెట్‌లోని మరో కోణాన్ని చూడటానికే ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టానని పేర్కొన్నాడు. భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడిన డీకే.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించకుండానే వ్యాఖ్యత అవతారమెత్తాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన ఆయన.. జట్టులో ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ అతన్ని పరిగణలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు