ఆంక్షల్లో సడలింపులివ్వండి

8 Jan, 2021 06:17 IST|Sakshi

సీఏకు బీసీసీఐ లేఖ  

న్యూఢిల్లీ: భారత్‌–ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో చర్చనీయాంశంగా నిలుస్తోన్న బ్రిస్బేన్‌ టెస్టు క్వారంటైన్‌ నిబంధనల్ని సడలించాలని పేర్కొంటూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు లేఖ రాసింది. పర్యటన ప్రారంభంలోనే టీమిండియా కఠిన ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్నందున మళ్లీ నాలుగో టెస్టు కోసం బ్రిస్బేన్‌లో నిర్బంధంలో ఉండటం కష్టమని లేఖలో స్పష్టం చేసింది. సిరీస్‌ కోసం ఇరు బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందంలోనూ రెండు వేర్వేరు నగరాల్లో భారత జట్టు రెండుసార్లు కఠిన ఐసోలేషన్‌ పాటిస్తుందని ఎక్కడా పేర్కొనలేదని గుర్తు చేసింది. ఈనెల 15నుంచి బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు జరగనుంది.

బ్రిస్బేన్‌ ఉన్న క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రం కరోనా కట్టడి నిబంధనల ప్రకారం ఆటగాళ్లు మ్యాచ్‌ అనంతరం కేవలం వారి గదులకే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే యూఏఈలో ఐపీఎల్‌ ముగించుకొని ఆస్ట్రేలియా చేరుకున్న భారత జట్టు అప్పుడే సిడ్నీలో ఈ తరహా కఠిన క్వారంటైన్‌ను పాటించింది. మళ్లీ బ్రిస్బేన్‌లో గదులకే పరిమితం అవ్వడాన్ని ఇబ్బందిగా భావిస్తోన్న భారత క్రీడాకారులు... హోటల్‌లోని బయోబబుల్‌లో సహచరులతో కలిసి భోజనం చేసేందుకు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇప్పటివరకు పేర్కొన్న ప్రకారం ఒకే అంతస్థులో ఉండే ఆటగాళ్లు కలుసుకోవచ్చు, కానీ వేరే అంతస్థులో ఉంటోన్న సహచరులతో దూరం పాటించాలి. ఇలాంటి నిబంధనలనే సడలించాలని లేఖలో కోరిన బీసీసీఐ, ఆటగాళ్లు ఐపీఎల్‌ తరహా బయోబబుల్‌ నిబంధనల్ని కోరుకుంటున్నట్లు చెప్పింది. భారత తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానే సైతం బయటంతా మామూలుగా ఉన్నప్పుడు కేవలం హోటల్‌ గదులకే పరిమితం కావడం సవాలుతో కూడుకున్నదని అసంతృప్తి వ్యక్తం చేశాడు.   

మరిన్ని వార్తలు