మారిపోనున్న టీమిండియా ఆటగాళ్ల జెర్సీలు

18 Nov, 2020 13:21 IST|Sakshi

‘ఎంపీఎల్‌’ కిట్‌లతో టీమిండియా

మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌తో బీసీసీఐ అధికారిక ఒప్పందం

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టుకు కిట్‌ స్పాన్సర్‌గా ప్రఖ్యాత స్పోర్టింగ్‌ కంపెనీ ‘నైకీ’ 15 ఏళ్ల బంధం అధికారికంగా ముగిసింది. టీమిండియా కిట్‌ అండ్‌ మర్కండైజ్‌ స్పాన్సర్‌గా ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ అపెరల్‌ అండ్‌ యాక్సెసరీస్‌తో బీసీసీఐ తాజాగా ఒప్పం దం కుదుర్చుకుంది. ఇ–స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌)కు చెందినదే ఈ ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌. ఇకపై భారత సీనియర్‌ పురుషుల, మహిళల జట్లు, అండర్‌–19 టీమ్‌ల జెర్సీలపై ‘ఎంపీఎల్‌’ లోగో కనిపిస్తుంది. నవంబర్‌ 27 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డే నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుండగా... 2023 డిసెంబర్‌ వరకు మూడేళ్ల కాలానికి ఎంపీఎల్‌–బీసీసీఐ భాగస్వామ్యం కొనసాగుతుంది. టీమిండియా అధికారిక జెర్సీలతో పాటు ఇతర క్రీడా సామగ్రిని అమ్ముకునేందుకు కూడా ఎంపీఎల్‌కు హక్కులు లభిస్తాయి. బెంగళూరు కేంద్రంగా పని చేసే ఈ గేమింగ్‌ కంపెనీలో గరిమెళ్ల సాయి శ్రీనివాస్‌ కిరణ్, శుభమ్‌ మల్హోత్రా భాగస్వాములు.  

ఐపీఎల్‌ తర్వాత... 
2006 జనవరి 1 నుంచి ‘నైకీ’ టీమిండియాకు కిట్‌ స్పాన్సర్‌గా వ్యవహరించింది. కాలానుగుణంగా ఈ ఒప్పందం రెన్యువల్‌ అవుతూ రాగా... గత నాలుగేళ్ల కాంట్రాక్ట్‌లో ‘నైకీ’ భారత జట్టు ఆడే ప్రతీ మ్యాచ్‌కు రూ. 85 లక్షల చొప్పున ఇవ్వడంతో పాటు రాయల్టీగా మరో రూ. 30 కోట్లు బోర్డుకు చెల్లించింది. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో తాము ఇంత చెల్లించలేమని, ఆ మొత్తాన్ని తగ్గిస్తే కిట్‌ స్పాన్సర్‌గా కొనసాగుతామని ‘నైకీ’ కోరగా భారత బోర్డు అందుకు అంగీకరించలేదు. కొత్తగా బిడ్‌లను ఆహ్వానించగా, ఎవరూ ముందుకు రాలేదు. దాంతో చివరి తేదీని మళ్లీ పొడిగించాల్సి వచ్చింది. ఆ తర్వాత అడిడాస్, ప్యూమావంటి టాప్‌ కంపెనీలతో పాటు డ్రీమ్‌ 11 స్పోర్ట్స్, రాంగ్, వాల్ట్‌ డిస్నీ కూడా టెండర్లు కొనుగోలు చేశాయి.

కానీ మ్యాచ్‌కు ఇవ్వాల్సిన మొత్తంపైనే వెనక్కి తగ్గిన వీరు టెండరు దాఖలు చేయలేదు. చివరకు నిబంధనలు మార్చి మరీ ఇప్పుడు ‘ఎంపీఎల్‌’కు బీసీసీఐ కాంట్రాక్ట్‌ కట్టబెట్టింది. ఎంపీఎల్‌ ఇప్పుడు ఒక్కో మ్యాచ్‌కు రూ. 65 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఏడాదికి రూ.3 కోట్ల చొప్పున మొత్తం రూ. 9 కోట్లు అదనంగా రాయల్టీ కింద అందజేస్తుంది. ఈ మూడేళ్ల కాలంలో భారత జట్టు కనీసం 142 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్‌–2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు
ఎంపీఎల్‌ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది.   

మరిన్ని వార్తలు