CWC 2023 Final: ఇటు ఫైనల్‌... అటు జిగేల్‌! తారలు, తారాజువ్వలు

19 Nov, 2023 04:09 IST|Sakshi

ఆట మొదలవ్వాలంటే ముందు టాస్‌ పడాలి. కానీ ఈ టాస్‌ కంటే ముందు కనువిందు చేసే విన్యాసాలెన్నో నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఆద్యంతం రంజింపచేసేలా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ఏర్పాట్లు, అరుదైన ఘట్టాలు  ఆవిష్కరించనుంది. 

అహ్మదాబాద్‌: భారత్, ఆస్ట్రేలియాల మధ్య నేడు నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఫైనల్‌ పోరు వికెట్లు, మెరుపులతోనే కాదు... మిరుమిట్లు, వెలుగుజిలుగులతో నెక్ట్స్‌ లెవెల్‌ వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ఆటకుముందే ఎయిర్‌షో, ఆట మధ్యలో లేజర్‌ షో, సంగీత విభావరి ఆఖర్లో కనివినీ ఎరుగని రీతిలో బాణాసంచా మిరుమిట్లు ఆకాశానికి పందిరి పరచనుంది.  

వైమానిక ‘షో’కులద్దుకొని 
ఆట ప్రారంభానికి ముందు ఎంతో హంగామా మైదానంలో నడువనుంది. నేలని టాస్‌ నాణెం ముద్దుపెట్టుకుంటే... నింగిని ఎయిర్‌ షో సెల్యూట్‌ చేస్తుంది. భారత వైమానిక దళానికి చెందిన ‘ది సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌’ టీమ్‌ ఆకాశంలో విన్యాసాలతో అలరించనుంది. తొమ్మిది ప్రత్యేక ఫ్లైట్లతో పది నిమిషాల పాటు ఈ ఎయిర్‌ షో ప్రేక్షకుల్ని ఆకట్టిపడేయనుంది. దీనికి సంబంధించి శుక్ర, శనివారాల్లో రిహార్సల్స్‌ కూడా పూర్తిచేశారు. 

చాంపియన్‌ కెప్టెన్లకు సలామ్‌ 
ఇంతకుముందెపుడు జరగని విధంగా... ప్రపంచకప్‌ చరిత్రలోనే నిలిచిపోయే మధురఘట్టానికి చాంపియన్‌ కెప్టెన్లు విశిష్ట అతిథులు కానున్నారు. 1975, 1979, 1983, 1987, 1992, 1996, 1999, 2003, 2007, 2011, 2015, 2019... ఈ పన్నెండు ప్రపంచకప్‌ల విజయసారథులకు విశేషరీతిలో బ్లేజర్లు, జ్ఞాపికలతో సత్కరించే కార్యక్రమం జరుగనుంది.  
ప్రీతమ్‌ గానాబజానా 
‘ధూమ్‌’ సిరీస్‌లకే ధూమ్‌ మచాలేతో సినీప్రియుల్ని వెర్రెక్కించిన ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రీతమ్‌ ఆధ్వర్యంలో 500 పైచిలుకు కళకారులతో నిర్వహించబోయే ఆటపాట స్టేడియాన్ని హోరెత్తించనుంది. భారతీయ సంప్రదాయ నాట్యం, నృత్యరీతులు, డాన్సులు జేజేలు పలికే విధంగా కళాకారుల బృందం రిహార్సల్స్‌లో చెమటోడ్చింది. 

లేజర్‌ షో...డ్రోన్‌ వీజువల్‌ వండర్స్‌ 
దేనికదే సాటి అన్నచందంగా ఇన్నింగ్స్‌ బ్రేక్‌లో లేజర్‌ షో లైటింగ్‌ విన్యాసాలు ఆకాశాన్ని రంగుల మయం చేయనుంది. అలాగే డ్రోన్‌ వీజువల్‌ వండర్స్‌తో నింగిలో ప్రపంచకప్‌ను ఆవిష్కృతం చేసే షోపై అందరి దృష్టి పడింది. 

తారలు, తారాజువ్వలు 
స్టేడియంలో బాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్‌ ఇలా ప్రతీ సినీ పరిశ్రమకు చెందిన తారలు స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణ కానుండగా... ఆకాశంలో బాణాసంచా వెలుగులు, తారాజువ్వలతో చేసే హంగామా కృత్రిమ చుక్కల్ని చూపనున్నాయి. 

6000 మందితో భద్రత 
పెద్ద స్టేడియం కావడం... ఫైనల్‌ పోరు జరగడం... లక్ష పైచిలుకు ప్రేక్షకులండటం... అతిరథమహారథులంతా విచ్చేయనుండటంతో నరేంద్రమోదీ స్టేడియమే కాదు... అహ్మదాబాద్‌పై కూడా డేగకన్ను వేశారు. గుజరాత్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ‘రాష్ట్ర పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, హోంగార్డ్స్, ఇతర సాయుధ బలగాలు కలుపుకొని 6000 పైచిలుకు సిబ్బందితో మోదీ స్టేడియాన్ని పహారా కాస్తున్నారు. మూడు వేల మంది అయితే స్టేడియం లోపలే అప్రమత్తంగా ఉంటారు.

మరిన్ని వార్తలు