IND Vs AUS: శ్రేయాస్‌ అయ్యర్‌ ఆగమనం.. వేటు ఎవరిపై?

14 Feb, 2023 21:15 IST|Sakshi

ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌. గాయం కారణంగా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయానికి తెర పడింది. ఢిల్లీ వేదికగా జరగనున్న టెస్టుకు శ్రేయాస్‌ అయ్యర్‌ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ట్విటర్‌ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.

''వెన్నునొప్పితో గాయ‌ప‌డుతున్న శ్రేయ‌స్ అయ్యర్ జాతీయ క్రికెట్ అకాడ‌మీలో విజ‌య‌వంతంగా రిహ‌బిలిటేష‌న్ పూర్తి చేసుకున్నాడు. అయ్య‌ర్‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన బీసీసీఐ వైద్య బృందం అత‌ను ఫిట్‌గా ఉన్నాడ‌ని స‌ర్టిఫికెట్ ఇచ్చింది. రెండో టెస్టుకు అత‌ను జ‌ట్టులో క‌లవ‌నున్నాడు. బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా భార‌త్, ఆస్ట్రేలియా మ‌ధ్య ఢిల్లీలో రెండో టెస్టు జ‌ర‌గ‌నుంది'' అని బీసీసీఐ ట్వీట్‌లో తెలిపింది.


కాగా టెస్టుల్లో అయ్యర్‌కు మంచి రికార్డే ఉంది. ముఖ్యంగా స్పిన్‌ను బాగా ఆడగలడని పేరున్న అయ్యర్‌ ఇప్పటివరకు ఏడు టెస్టుల్లో 56.27 సగటుతో 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.  ముఖ్యంగా ఉపఖండపు పిచ్‌లపై ఉండే టర్నింగ్‌ ట్రాక్స్‌లో బాగా ఆడగల సామర్థ్యం అయ్యర్‌ సొంతం. ఇదే అయ్యర్‌ను ముఖ్యమైన బ్యాటర్‌గా నిలిపింది. అయితే అయ్య‌ర్ ఫిట్‌నెస్ సాధించ‌డంతో సూర్య‌కుమార్ యాద‌వ్ బెంచ్‌కే ప‌రిమితం అవుతాడా? ఫామ్‌లో ఉన్న శుభ్‌మ‌న్ గిల్‌కు అవ‌కాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్ గెలిచేందుకు కీల‌క‌మైన రెండో టెస్టులో ఎవ‌రు ఆడ‌తారనేది ఆస‌క్తిక‌రంగా మారింది. 

రెండో టెస్టుకు భార‌త జట్టు: రోహిత్ శ‌ర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మ‌న్ గిల్, ఛ‌తేశ్వ‌ర్ పూజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యార్, సూర్య‌కుమార్ యాద‌వ్‌, కేఎస్ భ‌ర‌త్ (వికెట్ కీప‌ర్), ఇషాన్ కిష‌న్ (వికెట్ కీప‌ర్), అశ్విన్, జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్‌, ష‌మీ, సిరాజ్, ఉమేశ్ యాద‌వ్‌.

మరిన్ని వార్తలు