Border-Gavaskar Trophy 2023: ‘మా వద్దా స్పిన్‌ అస్త్రాలు ఉన్నాయి’

5 Feb, 2023 04:52 IST|Sakshi

ఆసీస్‌ బౌలింగ్‌ బృందంపై కమిన్స్‌ విశ్వాసం

తొలి టెస్టుకు అందుబాటులో గ్రీన్‌!

బెంగళూరు: భారత గడ్డపై టెస్టు సిరీస్‌ అంటే స్పిన్‌ బౌలింగ్‌ ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలుసు. అశ్విన్, జడేజా, అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ యాదవ్‌లాంటి స్పిన్నర్లను ఎదుర్కొని ఆస్ట్రేలియా ఎలా పరుగులు సాధిస్తుందనేది ఆసక్తికరం. అయితే మరోవైపు తమ స్పిన్‌ కూడా బలమైందేనని ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ నమ్ముతున్నాడు. ఈ నెల 9 నుంచి బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో కమిన్స్‌ శనివారం మీడియాతో మాట్లాడాడు.

తమ జట్టులోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని, భిన్నమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని కమిన్స్‌ అన్నాడు. ఈ సిరీస్‌లో నాథన్‌ లయన్‌ ఆసీస్‌ ప్రధానాస్త్రం కాగా, ఇతర స్పిన్నర్లు అతనికి అండగా నిలవనున్నారు. ‘మా జట్టులోనూ ఆఫ్‌స్పిన్నర్, లెగ్‌స్పిన్నర్, లెఫ్టార్మ్‌ పేసర్‌... ఇలా భిన్నమైన బౌలర్లు అందుబాటులో ఉన్నారు. అయితే పరిస్థితులను బట్టి 20 వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న బౌలింగ్‌ బృందాన్నే ఎంచుకుంటాం. నాగపూర్‌లో తొలి టెస్టు సమయానికే స్పష్టత వస్తుంది’ అని కమిన్స్‌ చెప్పాడు.

తమ స్పిన్నర్లపై మేనేజ్‌మెంట్‌కు గట్టి నమ్మకం ఉందని అతను వెల్లడించాడు. ‘ఆస్టన్‌ అగర్‌ మంచి ప్రతిభావంతుడు. గత రెండు విదేశీ పర్యటనల్లో ఆడిన స్వెప్సన్‌కు అనుభవం వచ్చింది. మర్ఫీ కూడా గత సిరీస్‌ ఆడాడు. ట్రవిస్‌ హెడ్‌ కూడా మంచి ఆఫ్‌స్పిన్‌ వేయగలడు. కాబట్టి వీరంతా లయన్‌కు సహకరించగలరు’ అని ఆసీస్‌ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. అయితే స్పిన్‌పై చర్చలో తమ పేస్‌ బౌలర్ల పదును గురించి ఎవరూ చర్చించడం లేదని కమిన్స్‌ వ్యాఖ్యానించాడు. ‘అన్ని పరిస్థితుల్లోనూ సత్తా చాటగల పేస్‌ బౌలర్లు మాకు ఉన్నారు.

పేస్‌కు పెద్దగా సహకరించని సిడ్నీ పిచ్‌లపై కూడా వారు చెలరేగారు. గత భారత పర్యటనలో రాంచీ టెస్టులో నేను మంచి ప్రదర్శన కనబర్చడం మరచిపోలేను. ఈసారి నాపై మరింత బాధ్యత ఉంది’ అని కంగారూ టీమ్‌ సారథి పేర్కొన్నాడు. మరోవైపు వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ తొలి టెస్టు ఆడే అవకాశాలు మెరుగవుతున్నాయి. తాజా సన్నాహక శిబిరంలో అతను బాగా బౌలింగ్‌ చేశాడని, బ్యాటింగ్‌లో కొంత అసౌకర్యంగా ఉన్నా... మ్యాచ్‌ సమయానికి కోలుకుంటే తుది జట్టులో స్థానం ఖాయమని ఆస్ట్రేలియా హెడ్‌ కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ వెల్లడించాడు. గ్రీన్‌ టీమ్‌లోకి వస్తే అదనపు స్పిన్నర్‌ను ఆడించేందుకు ఆసీస్‌కు అవకాశం ఉంటుంది.  

‘రివర్స్‌ స్వింగ్‌’ పని చేస్తుంది: క్యారీ  
భారత్‌లో స్పిన్‌ బౌలింగ్‌ ప్రభావం గురించే అంతా మాట్లాడుతున్నారని, అయితే రివర్స్‌ స్వింగ్‌ తమను ఇబ్బంది పెట్టవచ్చని ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ అభిప్రాయపడ్డాడు. 2018లో ఆసీస్‌ ‘ఎ’ తరఫున ఇక్కడ ఆడినప్పుడు స్పిన్‌ కోసం సిద్ధమైతే భారత పేసర్లు రివర్స్‌ స్వింగ్‌తో తమను పడగొట్టారని గుర్తు చేసుకున్నాడు. బుమ్రా, పంత్‌లాంటి ఆటగాళ్లు లేక ప్రస్తుత భారత జట్టు కొంత బలహీనంగా కనిపిస్తోందని, కొద్దిగా కష్టపడితే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ గెలిచే అవకాశం ఉందని మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ చాపెల్‌ వ్యాఖ్యానించాడు. టీమిండియా కోహ్లిపై అతిగా ఆధారపడుతోందన్న చాపెల్‌... ఖాజా, లబుషేన్‌లాంటి ఆటగాళ్లకు ఇది అతి పెద్ద పరీక్షగా అభివర్ణించాడు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు