Rohit Sharma: గేల్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం ఖాయం! అస్సలు అనుకోలేదు..

8 Sep, 2023 16:21 IST|Sakshi
క్రిస్‌ గేల్‌- రోహిత్‌ శర్మ

Rohit Sharma on Chris Gayle’s record In  in international cricket: వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ రికార్డు తాను బద్దలు కొడితే బాగానే ఉంటుందని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. అయితే, ఇలాంటి విషయాల గురించి తాను ఎక్కువగా ఆలోచించని పేర్కొన్నాడు. కాగా 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ ముంబై బ్యాటర్‌.. ఒకప్పుడు జట్టులో చోటు కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి.

ఓపెనర్‌గా ప్రమోటై.. హిట్‌మ్యాన్‌గా రోహిత్‌
మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని చొరవతో ఓపెనర్‌గా ప్రమోట్‌ అయిన రోహిత్‌.. హిట్‌మ్యాన్‌గా మారిపోయాడు. అద్భుతమైన ఆట తీరుతో అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా టీమిండియా కెప్టెన్‌ అయ్యాడు. వన్డేల్లో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడు డబుల్‌ సెంచరీలు బాది చరిత్రకెక్కాడు.

అరుదైన రికార్డు ముంగిట రోహిత్‌
అంతేకాదు.. సిక్సర్ల విషయంలోనూ టీమిండియా బ్యాటర్లందరి కంటే ముందే ఉన్నాడు. అంతర్జాతీయ టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో వరుసగా.. 77, 280, 182 సిక్స్‌లు బాదాడు హిట్‌మ్యాన్‌. ఈ క్రమంలో.. ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. 

యూనివర్సల్‌ బాస్‌ సిక్సర్ల రికార్డుపై కన్నేసిన హిట్‌మ్యాన్‌
ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా విండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ తన పేరిట ప్రపంచ రికార్డు లిఖించుకున్నాడు. 483 మ్యాచ్‌లలో యూనివర్సల్‌ బాస్‌ ఏకంగా 553 సిక్స్‌లు బాదాడు. కాగా క్రిస్‌ గేల్‌ రికార్డును అధిగమించేందుకు రోహిత్‌ కేవలం 15 సిక్స్‌ల దూరంలో ఉన్నాడు.

అస్సలు అనుకోలేదు
ఈ నేపథ్యంలో.. క్రికెట్‌ జర్నలిస్టు విమల్‌ కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒకవేళ ఇది సాధ్యమైతే అరుదై రికార్డుగా మిగిలిపోతుంది. అయినా క్రిస్‌ గేల్‌ రికార్డును బద్దలు కొడతానని అస్సలు అనుకోలేదు. ఇలాంటి వాటి గురించి ఆలోచించడం ఫన్నీగా ఉంటుంది’’ అని హిట్‌మ్యాన్‌ వ్యాఖ్యానించాడు.

539 సిక్సర్లతో రెండో స్థానంలో రోహిత్‌
కాగా ఆసియా కప్‌-2023లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఆరు సిక్స్‌లు బాదిన విషయం తెలిసిందే. శ్రీలంకలోని పల్లకెలెలో జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లో 74 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్‌.. టీమిండియాను 10 వికెట్ల తేడాతో గెలిపించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఇక ఈ వన్డే టోర్నీలో టీమిండియా తదుపరి పాకిస్తాన్‌తో కొలంబోలో తలపడనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు రోహిత్‌ శర్మ మొత్తంగా 446 మ్యాచ్‌లు ఆడి 539 సిక్స్‌లు బాదాడు. 

చదవండి: సచిన్‌ కంటే ఇంజమామ్‌ గొప్ప.. కోహ్లి కంటే బాబర్‌ బెటర్‌.. ఏంటిది? చెత్తగా..

మరిన్ని వార్తలు