వరల్డ్‌కప్‌ జట్టును అధికారికంగా ప్రకటించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. ఒక్క మార్పు

28 Sep, 2023 18:17 IST|Sakshi

క్రికెట్‌ ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌ 2023లో పాల్గొనే తమ జట్టును కొద్దిసేపటి కిందట అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టులో ఊహించిన విధంగానే గాయం నుంచి పూర్తి కోలుకోని ఆస్టన్‌ అగర్‌కు చోటు దక్కలేదు. అతని స్థానంలో మార్నస్‌ లబూషేన్‌ జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకుంటున్న ట్రవిస్‌ హెడ్‌ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మిగతా జట్టంతా ముందుగా ప్రకటించిన విధంగా యథాతథంగా కొనసాగుతుంది.

కాగా, క్రికెట్‌ ఆస్ట్రేలియా కొద్ది రోజుల కిందట తమ వరల్డ్‌కప్‌ ప్రొవిజనల్‌ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో మార్పులు చేర్పులకు ఇవాళ (సెప్టెంబర్‌ 28) ఆఖరి తేదీ కావడంతో సీఏ ఓ మార్పు చేసింది. ప్రొవిజనల్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన లబూషేన్‌ ఆ తర్వాత ఆడిన 8 మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి, గాయపడిన అగర్‌ స్థానంలో జట్టులోకి వచ్చాడు. 

ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆసీస్‌.. టీమిండియాను ఢీకొంటుంది. దీనికి ముందు ఆసీస్‌ రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. సెప్టెంబర్‌ 30న నెదర్లాండ్స్‌తో.. అక్టోబర్‌ 3న పాకిస్తాన్‌తో కమిన్స్‌ సేన తలపడుతుంది.

వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే ఆస్ట్రేలియా జట్టు ఇదే: పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, ట్రవిస్‌ హెడ్‌, కెమరూన్‌ గ్రీన్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, సీన్‌ అబాట్‌, మార్నస్‌ లబూషేన్‌, అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఇంగ్లిస్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా, మిచెల్‌ స్టార్క్‌

మరిన్ని వార్తలు