నా ఇంట్లో వారికేమీ దొరకదు.. తలదించుకునే ప్రసక్తే లేదు.. కేజ్రీవాల్ 

28 Sep, 2023 18:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక బంగ్లా రెన్నోవేషన్ పనుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ గురువారం దర్యాప్తు ప్రారంభించింది. ఈ పనులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేయాల్సిందిగా పీడబ్ల్యూడీ శాఖను ఆదేశించింది సీబీఐ. ఇదిలా ఉండగా సీబీఐ విచారణపై ఢిల్లీ ముఖ్యమంత్రి స్పందిస్తూ ఎంక్వైరీలో ఆరోపణలు అబద్దమని తేలితే ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. 

భయపడేది లేదు.. 
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నేను ముఖ్యమంత్రి అయ్యిన దగ్గర నుంచి ఇప్పటివరకు నాపై మొత్తం 50 కేసుల్లో విచారణ జరిగింది. ప్రధాని ఎందుకో నన్ను చూసి భయపడుతున్నారు. ఒకసారి లిక్కర్ కేసు అంటారు, మరోసారి బస్సు స్కామ్ అంటారు.. అన్ని కేసులు పెట్టినా వారు సాధించింది ఏమీలేదు. కావాలంటే ఇప్పుడు కూడా నా ఇల్లు మొత్తం తనిఖీలు చేసుకోండి. మీకు ఏమీ దొరకదన్నారు. 

రాజీనామా చేస్తారా?
కేంద్రానికి ఒకే మాట చెప్పదలచుకున్నా.. మీరు భయపెట్టాలని చూస్తున్నా నేను భయపడే రకం కాదు. గుర్తుపెట్టుకోండి కేజ్రీవాల్ తలదించుకునే ప్రసక్తే లేదని అన్నారు. నా ఇంటి నిర్మాణ విషయంలో సీబీఐ విచారణ పూర్తయ్యాక అవినీతి ఏమీ జరగలేదని తేలితే ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగించడానికి సిద్ధమైంది. కేజ్రేవాల్ ఎవ్వరికీ భయపడడని అన్నారు.     

గవర్నర్ నివేదిక.. 
ఎన్నికలకు ముందు సాధారణ జీవనం అన్న నినాదాన్ని కేజ్రీవాల్ తుంగలో తొక్కారని ఆయన బంగ్లాలోని ఒక్క కర్టైన్ విలువ రూ.8 లక్షలు ఉంటుందని ఆరోపించింది బీజేపీ. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసం పునర్నిర్మాణానికి రూ.45 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని దీనిలో అవకతవకలు జరిగాయని లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్‌జీ సక్సేనా ఒక నివేదికను సమర్పిస్తూ వీటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను భద్రపరచాల్సిందిగా ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్. సక్సేనా తాను ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేపట్టాలని ఒక లేఖ ద్వారా సీబీఐని కోరారు.   

ఇది కూడా చదవండి: బెంగుళూరు ట్రాఫిక్ జామ్‌లో టైమ్‌కి పిజ్జా డెలివరీ..

మరిన్ని వార్తలు