CWC 2023 Final: అతడే మాకు అతిపెద్ద సవాల్‌.. హోరెత్తే స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చడమే లక్ష్యం: ఆసీస్‌ కెప్టెన్‌

19 Nov, 2023 10:18 IST|Sakshi

ICC CWC 2023 Final- Pat Cummins Comments Ahead Big Clash: వన్డే వరల్డ్‌కప్‌-2023 ఆరంభంలో పరాజయాల పాలైన ఆస్ట్రేలియా ఆ తర్వాత ఊహించని రీతిలో పుంజుకుంది. వరుసగా ఎనిమిది విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకువచ్చింది. అహ్మదాబాద్‌ వేదికగా పటిష్ట టీమిండియాతో తుదిపోరుకు సిద్ధమైంది.

ఆరోసారి ట్రోఫీ గెలవాలనే సంకల్పంతో ఉన్న ప్యాట్‌ కమిన్స్‌ బృందం.. మూడోసారి టైటిల్‌ విజేతగా నిలవాలని పట్టుదలగా ఉన్న రోహిత్‌ సేనను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆరంభంలో మా ఆట తర్వాత మేం అన్నీ సమీక్షించుకొని విజయాల బాట పట్టాం. అది మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

ప్రత్యర్థికి సవాల్‌ విసరాలంటే మా అత్యుత్తమ దశలోనే ఉండాల్సిన అవసరం లేదు. మేం విజయానికి దారులు వెతుక్కోగలం. ఇప్పుడు ఆడుతున్నవారెవరూ అప్పుడు లేరు కాబట్టి 2003 గురించి ఆలోచన అనవసరం. అయితే మైదానంలో 1 లక్షా 30 వేల మంది ప్రేక్షకులు ఉంటారని, వారంతా భారత్‌కే మద్దతిస్తారని మాకు తెలుసు.

స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చడమే లక్ష్యం
ఓటమి లేకుండా దూసుకుపోతున్న అలాంటి జట్టును నిలువరించి స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చాలని కోరుకుంటున్నాం. అదే జరిగితే అంతకు మించిన సంతృప్తి ఉండదు’’ అని ప్యాట్‌ కమిన్స్ అన్నాడు ఇక టీమిండియాతో ఫైనల్లో పేసర్‌ మహ్మద్‌ షమీ తమకు అతిపెద్ద సవాలుగా మారతాడని కమిన్స్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

కాగా ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన షమీ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు కూల్చిన ఈ యూపీ పేసర్‌.. తర్వాత మరో రెండు ఐదు వికెట్ల హాల్స్‌ నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో ఏడు వికెట్లతో చెలరేగి టీమిండియాను ఫైనల్‌ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇది సెమీ ఫైనల్‌ కాదు.. షమీ ఫైనల్‌ అనేలా అద్భుతం చేశాడు. ఈ నేపథ్యంలో కమిన్స్‌ సైతం షమీ గురించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ముఖాముఖి పోరులో
వన్డే ప్రపంచకప్‌ టోర్నీల చరిత్రలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ముఖాముఖిగా 13 సార్లు తలపడ్డాయి. భారత్‌ 5 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. అహ్మదాబాద్‌లో ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి. 2 మ్యాచ్‌ల్లో భారత్, 1 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచాయి. అహ్మదాబాద్‌లోనే జరిగిన 2011 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఆ్రస్టేలియాపై భారత్‌ గెలిచి సెమీఫైనల్‌ చేరింది.   

తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టుకే అవకాశాలు!
ఇప్పటి వరకు జరిగిన 12 వన్డే ప్రపంచకప్‌ టోర్నీల ఫైనల్స్‌లో ఎనిమిది సార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు విజేతగా నిలిచింది. నాలుగు సార్లు ఛేజింగ్‌ చేసిన జట్టు చాంపియన్‌గా నిలిచింది.  ఆస్ట్రేలియా జట్టు 3 సార్లు తొలుత బ్యాటింగ్‌ చేసి,. 2 సార్లు ఛేజింగ్‌లో... భారత జట్టు ఒకసారి తొలుత బ్యాటింగ్‌ చేసి, మరొకసారి ఛేజింగ్‌లో గెలిచింది. 

ఆతిథ్య జట్లదే
గత మూడు వన్డే ప్రపంచకప్‌ టోర్నీ టైటిల్స్‌ను ఆతిథ్య జట్లే సొంతం చేసుకున్నాయి. 2011లో భారత్, 2015లో ఆ్రస్టేలియా, 2019లో ఇంగ్లండ్‌ జట్లు విజేతగా నిలిచాయి.

అపుడు ఆసీస్‌ అలా
వన్డే ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నీ ఫైనల్స్‌లో నమోదైన అత్యధిక టీమ్‌ స్కోరు 359. భారత జట్టుతో జొహనెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌ స్టేడియంలో జరిగిన 2003 ప్రపంచకప్‌ ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 2 వికెట్లకు 359 పరుగులు చేసింది.

ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్స్‌లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా పాకిస్తాన్‌ నిలిచింది. 1999 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాతో లార్డ్స్‌ మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 39 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్‌గా 12 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో 300 అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన ఏకైక జట్టుగా ఆ్రస్టేలియా నిలిచింది.   

వన్డే ప్రపంచకప్‌ టోర్నీల చరిత్రలో (1975–2023) ఆస్ట్రేలియా ఆడిన మొత్తం మ్యాచ్‌లు 104 . ఇందులో 77 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచింది. 25 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ ‘టై’ అయింది. ఒక మ్యాచ్‌ రద్దయింది.  

వన్డే టోర్నీలో భారత్‌ @94
వన్డే ప్రపంచకప్‌ టోర్నీల చరిత్రలో (1975–2023) భారత్‌ ఆడిన మొత్తం మ్యాచ్‌లు 94 . ఇందులో 63 మ్యాచ్‌ల్లో భారత్‌ గెలిచింది. 29 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌ ‘టై’ అయింది. ఒక మ్యాచ్‌ రద్దయింది.  

►వన్డేల్లో భారత జట్టుకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించిన మ్యాచ్‌లు 44 . ఇందులో భారత్‌ 34 మ్యాచ్‌ల్లో గెలిచింది. 9 మ్యాచ్‌ల్లో ఓడింది.  ఒక మ్యాచ్‌ రద్దయింది. 
►వన్డేల్లో ఆస్ట్రేలియా జట్టుకు కమిన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన మ్యాచ్‌లు 14 . ఇందులో ఆస్ట్రేలియా 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు