CWC 2023: లంకతో మ్యాచ్‌కు ముందు గంభీర్‌ ఆసక్తికర కామెంట్స్‌

2 Nov, 2023 07:02 IST|Sakshi

భారత జట్టుకు చెందిన ‘బిహైండ్‌ ద సీన్స్‌’ వీడియోలు అందరూ ఇష్టపడుతున్నారని భావిస్తున్నాను. వ్యక్తిగతంగా ఈ వీడియోలు నాకెంతో నచ్చుతున్నాయి. మ్యాచ్‌ సందర్భంగా రాణించిన భారత ఫీల్డర్‌ టీమ్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ టి.దిలీప్‌ చేతుల మీదుగా ఉత్తమ ఫీల్డర్‌ పతకం అందుకుంటున్నాడు. ఈ అవార్డు ఇచ్చే సమయంలో చిన్న ప్రసంగం, సంబరాలు ఉంటున్నాయి. ఈ తరహా కార్యక్రమాలతో జట్టు సభ్యులందరిలో మరింత ఐక్యత పెరుగుతుంది. ప్రపంచకప్‌ పాయింట్ల పట్టికలో భారత్‌ అగ్రస్థానంలో ఉండటం, వరుస విజయాలు లభిస్తుండటంతో జట్టులోని సభ్యులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.

డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ ఎవరూ అభద్రతాభావంతో కనిపించడంలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తమ ఆటగాళ్లకు అవసరమైనన్ని అవకాశాలు ఇస్తున్నారు. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో షమీని ఆడించకపోవడం జట్టు వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. గతంలో కేఎల్‌ రాహుల్‌ విఫలమైనా అతనితో మాట్లాడుతూ, తప్పిదాలను సరిచేస్తూ మరిన్ని అవకాశాలు ఇస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. షార్ట్‌ బాల్‌ ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌తో కూడా రోహిత్, ద్రవిడ్‌ బృందం మాట్లాడే ఉంటుంది.

పొరపాటు ఎక్కడ జరుగుతుందో, ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతాడో అయ్యర్‌కు రోహిత్‌ సూచించే ఉంటాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని ఫ్లాట్‌ పిచ్‌పై ఈరోజు శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం కనిపిస్తోంది. భారత బ్యాటర్లకంటే బౌలర్లు మరోసారి మెరిపించాలని కోరుకుంటున్నాను. ఈ టోర్నీలో శ్రీలంక తడబడుతోంది. పూర్తిస్థాయి ఆటతీరును ఆ జట్టు ఇంకా కనబర్చలేదు. వారి ప్రదర్శనలో ఏదో లోపిస్తోంది. ఒకరిద్దరి వ్యక్తిగత ప్రదర్శనలు మినహా జట్టుగా మెరిపించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు నుంచి మరో భారీ విజయం రావడం ఖాయమనిపిస్తోంది.  

మరిన్ని వార్తలు