CWC 2023: వన్డే ప్రపంచకప్‌లో సంచలన విజయాలు.. స్టార్ట్‌ చేసింది ఎవరంటే..?

16 Oct, 2023 13:19 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌పై పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో ఇలాంటి సంచలనాలు ఎప్పుడెప్పుడు నమోదయ్యాయని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. వన్డే వరల్డ్‌కప్‌లో ఇలాంటి సంచలనాలు ఎప్పుడెప్పుడు నమోదయ్యాయని పరిశీలిస్తే.. సంచలనాలకు నాంది పలికింది భారతే అని తెలుస్తుంది. 

1983 వరల్డ్‌కప్‌లో కపిల్‌ నేతృత్వంలోని టీమిండియా నాటి మేటి జట్టైన వెస్టిండీస్‌ను మట్టికరిపించి, తొలిసారి జగజ్జేతగా ఆవతరించింది. 

అదే వరల్డ్‌కప్‌లో మరో సంచలనం కూడా నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న జింబాబ్వే.. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించింది. 

అనంతరం 1992 ఎడిషన్‌లో కూడా జింబాబ్వే జట్టు సంచలన విజయం సాధించింది. ఆ టోర్నీలో వారు ఇంగ్లండ్‌కు షాకిచ్చారు. 

1996 వరల్డ్‌కప్‌లో ఏకంగా పెను సంచలనమే నమోదైంది. అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్‌ను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అప్పుడే అడుగుపెట్టిన కెన్యా మట్టికరిపించింది. 

1999 వరల్డ్‌కప్‌లో జింబాబ్వే రెండు సంచలన విజయాలు సాధించింది. ఆ ఎడిషన్‌లో జింబాబ్వే.. సౌతాఫ్రికా, టీమిండియాలను ఓడించింది. అదే ఏడిషన్‌లో బంగ్లాదేశ్‌.. హేమాహేమీలతో కూడిన పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. 

2003 వరల్డ్‌కప్‌లో పటిష్టమైన శ్రీలంకపై కెన్యా ఘన విజయం సాధించి, సంచలనం సృష్టించింది. అదే టోర్నీలో కెన్యా.. బంగ్లాదేశ్‌, జింబాబ్వేలను కూడా ఓడించింది. 

2007 వరల్డ్‌కప్‌ విషయానికొస్తే..ఈ ఎడిషన్‌లో బంగ్లాదేశ్‌ టీమిండియాకు షాకివ్వగా.. ఐర్లాండ్‌.. పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. అనంతరం అదే టోర్నీలో బంగ్లాదేశ్‌.. సౌతాఫ్రికాను, బంగ్లాదేశ్‌ను ఐర్లాండ్‌ ఓడించాయి.

భారత్‌ వేదికగా జరిగిన 2011 ఎడిషన్‌లో భారీ స్కోర్‌ చేసిన ఇంగ్లండ్‌ను పసికూన ఐర్లాండ్‌ మట్టికరిపించింది. ఆ ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ను బంగ్లాదేశ్‌ కూడా ఓడించింది.

2015 ఎడిషన్‌లో బంగ్లాదేశ్‌.. ఇంగ్లండ్‌ను మరోసారి ఓడించి సంచలనం సృష్టించింది. ఆ ఎడిషన్‌లో ఐర్లాండ్‌.. వెస్టిండీస్‌, జింబాబ్వేలపై  సంచలన విజయాలు సాధించింది. 

మరిన్ని వార్తలు