CWC 2023: పాక్‌ను సెమీస్‌కు చేర్చేందుకు వసీం అక్రమ్‌ మాస్టర్‌ ప్లాన్‌

10 Nov, 2023 09:15 IST|Sakshi

ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్‌ సెమీస్‌కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఏదో అత్యద్భుతం జరిగితే తప్ప, దాయాది జట్టు ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించలేదు. శ్రీలంకపై న్యూజిలాండ్‌ భారీ తేడా గెలవడంతో నాలుగో సెమీస్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. భారత్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు ఆ జట్టు సెమీస్‌కు చేరడం​ ఖాయమైపోయింది. 

పాక్‌ సెమీస్‌కు చేరాలంటే ఆ జట్టు ముందు రెండు ప్రధాన అప్షన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇంగ్లండ్‌తో రేపు (నవంబర్‌ 11) జరుగబోయే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి అతి భారీ స్కోర్‌ చేయడం. అనంతరం ప్రత్యర్ధిని 287 పరుగుల తేడాతో ఓడించడం. ఈ మ్యాచ్‌లో పాక్‌ కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌ను 13 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. అదే 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు ప్రత్యర్ధిని మట్టుబెట్టాల్సి ఉంటుంది. 

వన్డేల్లో ఒక్కసారి కూడా 400 స్కోరు దాటని పాక్‌కు ఈ టాస్క్‌ అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో పాక్‌ టాస్‌​ ఓడితే బరిలోకి దిగకుండానే సెమీస్‌ ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇంగ్లండ్‌ నిర్ధేశించే ఎంతటి లక్ష్యాన్నైనా పాక్‌ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది. ఇది ఏ రకంగానూ ఊహకు అందని విషయం. కాబట్టి పాక్‌ సెమీస్‌ అవకాశాల విషయంలో ప్లాన్‌ ఏ ఫెయిల్‌ అయినట్లే అని చెప్పాలి.

ప్లాన్‌ బి ఏంటంటే..
పాక్‌ సెమీస్‌కు చేరే అంశంపై ఆ దేశ మాజీ ఆటగాడు వసీం అక్రమ్‌ వ్యంగ్యంగా స్పందించాడు. ఓ స్థానిక టీవీ ఛానల్‌ డిబేట్‌లో అతను మాట్లాడుతూ పాక్‌ జట్టుపై సెటైర్లు వేశాడు. ఇంగ్లండ్‌పై తమ జట్టు 400కు పైగా స్కోర్‌ చేయడం లేదా 287 పరుగుల భారీ తేడాతో గెలవడం వంటివి జరగని పనులు. కాబట్టి పాక్‌ సెమీస్‌కు చేరాలంటే ఇక మిగిలింది ఒకే ఒక​ మార్గం.

పాక్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. ఆపై ఇంగ్లండ్‌ జట్టును డ్రెస్సింగ్ రూమ్‌లో పెట్టి తాళం వేసి, వారి బ్యాటర్లందరినీ 'టైమ్డ్‌ ఔట్‌' అయ్యేలా చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌గా ప్రకటించబడిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే వసీం అక్రమ్‌ పాక్‌ జట్టుపై టైమ్డ్‌ ఔట్‌ సెటైర్లు వేశాడు.  

మరిన్ని వార్తలు