CWC 2023: బాగా ఎంజాయ్‌ చేశారనుకుంటా.. బై బై! మీ స్థాయికి తగునా భయ్యా?

10 Nov, 2023 15:42 IST|Sakshi

ICC WC 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023 సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటిన న్యూజిలాండ్‌ పాకిస్తాన్‌ అవకాశాలను గల్లంతు చేసింది. లీగ్‌ దశలో ఆఖరిగా శ్రీలంకతో మ్యాచ్‌లో 23.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మొత్తంగా 10 పాయింట్లు తమ ఖాతాలో జమచేసుకుంది.

దీంతో పాక్‌ ఆశలు అడియాసలయ్యాయి. అయితే, కివీస్‌- లంక మ్యాచ్‌ ఫలితం తేలిన తర్వాత కూడా బాబర్‌ ఆజం బృందం సెమీస్‌ రేసులో నిలవాలని భావిస్తే వన్డే క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని అద్భుతం జరగాల్సిందే.

అద్భుతం జరగాల్సిందే
పాకిస్తాన్‌ తమకు మిగిలిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై గెలిస్తే న్యూజిలాండ్‌ మాదిరే 10 పాయింట్లు సాధిస్తుంది. కానీ రన్‌రేటు పరంగా ఎంతో ముందున్న కివీస్‌ జట్టును దాటాలంటే..  కోల్‌కతాలో శనివారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై పాక్‌ ఏకంగా 287 పరుగుల తేడాతో గెలవాలి. 

కర్మకాలి ఇంగ్లండ్‌ గనుక టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంటే అక్కడే పాక్‌ కథ ముగిసిపోతుంది. ఎందుకంటే.. ఇంగ్లండ్‌ ఎంతటి లక్ష్యం విధించినా దానిని మూడు ఓవర్లలోపే పాక్‌ ఛేజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనైతే కాదు!

కాబట్టి భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌-2023 నుంచి పాక్‌ అనధికారికంగా నిష్క్రమించినట్లే! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పాకిస్తాన్‌ జట్టును తనదైన శైలిలో ట్రోల్‌ చేశాడు. 

సురక్షితంగా వెళ్లండి.. బైబై
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా.. ‘‘బై బై పాకిస్తాన్‌’’ అని రాసి ఉన్న అక్షరాల ఫొటోను హైలైట్‌ చేస్తూ..‘‘పాకిస్తాన్‌ జిందా‘భాగ్‌’(పారిపోండి అన్న అర్థంలో) ! మీరింతే.. ఇక్కడి దాకా రాగలరంతే! ఇక్కడి బిర్యానీ రుచి, ఆతిథ్యాన్ని పూర్తిగా ఆస్వాదించారనే అనుకుంటున్నా.

విమానంలో సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నా. బై బై పాకిస్తాన్‌’’ అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. దాయాది జట్టును ఉద్దేశించి ఈ మాజీ ఓపెనర్‌ చేసిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. 

కాగా వన్డే వరల్డ్‌కప్‌ ఆడేందుకు తొలుత హైదరాబాద్‌ చేరుకున్న పాకిస్తాన్‌ జట్టుకు ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ప్రేమికుల అభిమానానికి ఫిదా అయిన కెప్టెన్‌ బాబర్‌ ఆజం, పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది తదితరులు కృతజ్ఞతా భావం చాటుకున్నారు.

ఇక ఆ తర్వాత వెళ్లిన ప్రతిచోటా హోటల్‌ నుంచి కాకుండా పాక్‌ ఆటగాళ్లు.. బయట నుంచి బిర్యానీలు ఆర్డర్‌ చేశారన్న వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో వరుస ఓటముల నేపథ్యంలో ఆ జట్టు అభిమానులు సైతం పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పాక్‌ సెమీస్‌ ఆశలు గల్లంతైన తరుణంలో సెహ్వాగ్‌ ఈ మేరకు పోస్టు పెట్టడం గమనార్హం.

మీ స్థాయికి తగునా?
అయితే, చాలా మంది నెటిజన్లు వీరేంద్ర సెహ్వాగ్‌ తీరును తప్పుబడుతున్నారు. ‘‘శత్రువుకు కూడా ప్రేమను పంచే దేశానికి మీరు.. మీ స్థాయిని మరచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు సర్‌. గొప్ప క్రికెటర్‌గా చరిత్రలో స్థానం సంపాదించిన మీకు ఆటను ఆటలాగే చూడాలని తెలియదా’’ అంటూ చురకలు అంటిస్తున్నారు.

మరి వాళ్లు అన్నపుడు ఏం చేశారు?
అయితే, వీరూ ఫ్యాన్స్‌ మాత్రం.. ‘‘భయ్యా అన్నదాంట్లో తప్పేముంది? మన జట్టును ఉద్దేశించి పాక్‌ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలు మీకు కనిపించవా?’’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.

పాక్‌ మాజీ సారథి మహ్మద్‌ హఫీజ్‌ విరాట్‌ కోహ్లిని సెల్ఫిష్‌ అంటూ చేసిన కామెంట్లు, భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇచ్చారన్న రజా వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా సెహ్వాగ్‌ చేసిన పోస్టు నెట్టింట ఇలా చర్చకు దారితీసింది.

చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్‌బో బేబీ!

A post shared by Virender Sehwag (@virendersehwag)

మరిన్ని వార్తలు