CWC 2023: హార్ధిక్‌కు ధన్యవాదాలు.. అతడు గాయపడకపోయుంటే షమీ వచ్చేవాడా..?

16 Nov, 2023 12:02 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్బుత శతకాలతో పాటు మొహమ్మద్‌ షమీ (9.5-0-57-7) సూపర్‌ బౌలింగ్‌తో మెరవడంతో భారత్‌ తిరుగలేని విజయం సాధించి, నాలుగోసారి ఫైనల్స్‌కు చేరింది. 

ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్ల ఘనత పక్కన పెడితే.. బౌలర్‌గా షమీ సాధించిన దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. షమీ షంషేర్‌లా విజృంభించి ఒంటిచేత్తో కివీస్‌ బ్యాటర్ల భరతం పట్టాడు. ఈ మెరుపులు ఈ ఒక్క మ్యాచ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ టోర్నీలో అవకాశం​ వచ్చిన ప్రతిసారి చెలరేగిపోయాడు.

జట్టు సమీకరణల కారణంగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడని షమీ.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా గాయపడటంతో తుది జట్టులోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 5 వికెట్లతో విజృంభించిన షమీ.. ఆతర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. కేవలం 6 మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లతో లీడింగ్‌ వికెట్‌టేకర్‌గా కొనసాగుతున్నాడు.   ​ 

నిన్నటి మ్యాచ్‌లో షమీ సాధించిన ఘనత నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఆసక్తికర పోస్ట్‌లు పెడుతున్నారు. హార్ధిక్‌కు థ్యాంక్స్‌ చెప్పాలి.. అతను గాయపడటం వల్లే షమీ తుది జట్టులోకి వచ్చాడు.. హార్ధిక్‌ గాయపడకుండా ఉండివుంటే షమీకి అవకాశం వచ్చేదేనా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వీరు చేస్తున్న కామెంట్లలోనూ నిజం లేకపోలేదు.

హార్ధిక్‌ ఫిట్‌గా ఉండివుంటే షమీకి తుది జట్టులో అవకాశం వచ్చేది కాదు. జట్టు సమీకరణల పేరుతో గతంలో ఏం జరిగిందో అందరికి విధితమే. పేస్‌ బౌలర్ల కోటాలో బుమ్రా, సిరాజ్‌ తమతమ స్థానాలపై కర్ఛీఫ్‌లు వేసుకుని కూర్చున్నారు. హార్దిక్‌ జట్టులో ఉంటే మూడో పేసర్‌గా అతడే కొనసాగుతాడు. షమీ అవకాశం దాదాపుగా రాదు. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ ఉంటే, జట్టు మేనేజ్‌మెంట్‌ అదనపు స్పిన్నర్‌ లేదా బ్యాటర్‌ వైపే చూస్తుంది. వరల్డ్‌కప్‌ ముందు వరకు చాలా మ్యాచ్‌ల్లో ఇదే జరిగింది.
 

మరిన్ని వార్తలు