-

Ind W Vs Aus W: గార్డనర్ మెరుపు ఇన్నింగ్స్‌.. ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓటమి

29 Jul, 2022 19:24 IST|Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ హర్మాన్‌ప్రీత్‌ కౌర్‌(52), షఫాలీ వర్మ(48) పరుగులతో టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జానెసన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా..స్కాట్‌ రెండు వికెట్లు, బ్రౌన్‌ ఒక్క వికెట్‌ సాధించింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కాగా లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా కేవలం 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టా‍ల్లో పడింది. భారత యువ పేసర్‌ నాలుగు వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే ఆసీస్‌ను దెబ్బకొట్టింది. ఇక ఆసీస్‌ ఓటమి ఖాయం అనుకున్న వేళ బ్యాటర్లు ఆష్లీ గార్డనర్, గ్రేస్‌ హ్యారీస్‌ భారత్‌పై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 51 పరుగులు జోడించారు.

అనంతరం మేఘనా సింగ్ బౌలింగ్‌లో గ్రేస్ హారిస్ (20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 పరుగులు) ఔటైంది. ఆ తర్వాత వచ్చిన జొనసేన్ ను 14వ ఓవర్లో దీప్తి శర్మ పెవిలియన్‌కు పంపింది. ఒక వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతోన్న గార్డనర్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించింది. గార్డనర్ 52 పరుగులతో అఖరి వరకు నిలిచి ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్ జూలై 31న  పాకిస్తాన్ తో ఆడనున్నది. 
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టీ20.. అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్‌ శర్మ..!

మరిన్ని వార్తలు