మాకే ఎందుకిలా జరుగుతుంది : వార్నర్‌

3 Oct, 2020 17:58 IST|Sakshi
భువనేశ్వర్‌ కుమార్‌( కర్టసీ : బీసీసీఐ/ఐపీఎల్‌)

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను గాయాల బెడద వదలడం లేదు. మిచెల్‌ మార్ష్‌ గాయంతో ఇప్పటికే టోర్నీకి దూరమవగా.. తాజాగా శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వింగ్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గాయపడ్డాడు. మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో మొదటి బాల్‌ వేస్తుండగా ఎడమ తొడ కండరం పట్టేసింది. దీంతో ఓవర్‌ పూర్తి చేయకుండానే వెనుదిరిగాడు. కాగా ఖలీల్‌ అహ్మద్‌ మిగిలిన ఓవర్‌ను పూర్తి చేశాడు. మ్యాచ్‌ అనంతరం సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ భూవీ గాయంపై స్పందించాడు. (చదవండి :‘కోహ్లి కాన్ఫిడెంట్‌ అలా ఉంటుంది’)

'ఈ సీజన్‌లో మా జట్టును గాయాల బెడద పట్టి పీడిస్తుంది. మొన్నటికి మొన్న మార్ష్‌ గాయంతో వెనుదిరిగడం.. కేన్‌ విలియమ్సన్‌ గాయంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమవ్వడం.. తాజాగా భూవీ కూడా గాయపడడం చూస్తే మాకే ఎందుకిలా జరుగుతుంది అనే ప్రశ్న వస్తుంది. అయితే భూవీ గాయంపై ఇంకా క్లారిటీ లేదు. బౌలింగ్‌ చేస్తున్న సమయంలో భూవీ ఎడమకాలి తొండరం పట్టేసింది. దీంతో అతను పూర్తి ఓవర్‌ వేయకుండానే వెనుదిరిగడంతో ఖలీల్‌ అహ్మద్‌ మిగిలిన పని పూర్తి చేశాడు. అయితే గాయం తర్వతా భూవీ కొంచెం నడవడానికి ఇబ్బంది పడ్డాడు. భూవీ గాయం ఎంత తీవ్రం అనేది ఫిజియోథెరపీ పరిశీలించాకే తేలుతుంది. ఒకవేళ భూవి గాయంతో మ్యాచ్‌లకు దూరమవుతే మాకు పెద్ద దెబ్బే అని తెలిపాడు. కాగా మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైనా తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సన్‌రైజర్స్‌ మళ్లీ పోటీలో నిలిచింది.

కాగా  సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రియమ్‌ గార్గ్‌ (26 బంతుల్లో 51 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, అభిషేక్‌ శర్మ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్‌), మనీశ్‌ పాండే (21 బంతుల్లో 29; 5 ఫోర్లు), డేవిడ్‌ వార్నర్‌ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసి  ఓడింది.  జడేజా (35 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ ధోని (36 బంతుల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. (చదవండి : 'ఆ ఎమోషన్‌ను చాలా మిస్సవుతున్నాం')

మరిన్ని వార్తలు