జొకోవిచ్‌ శుభారంభం 

30 Aug, 2023 02:23 IST|Sakshi

రెండో రౌండ్‌లోకి సెర్బియా స్టార్‌

మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సొంతం

నాలుగో సీడ్‌ హోల్గర్‌ రూనె అవుట్‌

న్యూయార్క్‌: కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ లక్ష్యంతో యూఎస్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ అలవోకగా రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ 6–0, 6–2, 6–3తో అలెగ్జాండర్‌ ముల్లర్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గాడు. ఈ గెలుపుతో 36 ఏళ్ల జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌ ముగిశాక తుది ఫలితంతో సంబంధం లేకుండా మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు.

ముల్లర్‌తో గంటా 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఆరు ఏస్‌లు సంధించాడు. నెట్‌ వద్దకు 23 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్‌ చేసి తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. మరోవైపు నాలుగో సీడ్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌) పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది.

ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌ టోర్నీల్లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన రూనె 3–6, 6–4, 3–6, 2–6తో కార్‌బెలాస్‌ బేనా (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయాడు. ఏడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), పదో సీడ్‌ టియాఫో (అమెరికా), తొమ్మిదో సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.  

మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) కష్టపడి రెండో రౌండ్‌కు చేరగా... రెండుసార్లు మాజీ రన్నరప్‌ వొజి్నయాకి (డెన్మార్క్‌) సులువుగా రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. కోకో గాఫ్‌ 2 గంటల 51 నిమిషాల్లో 3–6, 6–2, 6–4తో సిగెముండ్‌ (జర్మనీ)పై, వొజి్నయాకి 6–3, 6–2తో ప్రొజోరోవా (రష్యా)పై గెలిచారు.   

మరిన్ని వార్తలు