ENG vs WI: చరిత్రలో రెండోసారి మాత్రమే.. 145 ఏళ్ల రికార్డు బద్దలు

25 Mar, 2022 17:07 IST|Sakshi

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ టెయిలెండర్లు  కొత్త చరిత్ర సృష్టించారు. తమ అసాధారణ బ్యాటింగ్‌తో 145 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. వారిద్దరే ఇంగ్లండ్‌ బౌలర్లు జాక్‌ లీచ్‌, సాకిబ్‌ మహమూద్‌లు. తొలిరోజు ఆటలో ఇంగ్లండ్‌ జట్టు విండీస్‌ బౌలర్ల దాటికి కుదేలయ్యింది. ఓపెనర్‌ అలెక్స్‌ లీస్‌(31) మినహా మిగతా టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ దెబ్బకు ఇంగ్లండ్‌ 67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో క్రిస్‌ వోక్స్‌(25), క్రెయిగ్‌ ఓవర్టన్‌(14)లు ఇంగ్లండ్‌ను కాసేపు ఆదుకున్నారు.

అయితే వరుస ఓవర్లలో ఈ ఇద్దరు ఔట్‌ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అప్పటికి ఇంగ్లండ్‌ స్కోరు 9 వికెట్ల నష్టానికి 114. ఈ దశలో 10వ నెంబర్‌ బ్యాటర్‌ జాక్‌ లీచ్‌(41 నాటౌట్‌), సాకిబ్‌ మహమూద్‌(49) చివరి వికెట్‌కు రికార్డు స్థాయిలో 90 పరుగుల జత చేశారు. దీంతో ఇంగ్లండ్‌ 89.4 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్‌ అయింది. జాక్‌ లీచ్‌, సాకిబ్‌ మహమూద్‌లు విండీస్‌ బౌలర్లను నిలువరిస్తూ చూపించిన తెగువ సూపర్‌ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు కలిసి 145 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. ఆఖరి వికెట్‌కు 10,11వ బ్యాట్స్‌మన్‌లు ఎక్కువ పరుగులు జోడించడం ఇది రెండోసారి మాత్రమే.

ఇంతకముందు  1885లో ఇదే ఇంగ్లండ్‌కు చెందిన టామ్‌ గారెట్‌, ఎడ్విన్‌ ఎవన్స్‌లు సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టులో ఆఖరి వికెట్‌కు 81 పరుగులు జోడించడమే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది. తాజాగా ఆ రికార్డును జాక్‌ లీచ్‌, సాకిబ్‌ మహమూద్‌లు బద్దలు కొట్టారు.  ఇక జో రూట్‌ సహా మిగతా టాప్‌ బ్యాట్స్‌మన్‌ అంతా దారుణంగా విఫలమయ్యారు.  విండీస్‌ బౌలర్లలో జైడెన్‌ సీల్స్‌ మూడు,  కీమర్‌ రోచ్‌, కైల్‌ మేయర్స్‌, అల్జారీ జోసెఫ్‌లు తలా రెండు వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు