Katherine Brunt: 'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్‌ దిగ్గజ క్రికెటర్‌ గుడ్‌బై

19 Jun, 2022 09:20 IST|Sakshi

ఇంగ్లండ్‌ దిగ్గజ మహిళా క్రికెటర్‌ కేథరిన్‌ బ్రంట్‌ టెస్టులకు గుడ్‌బై ప్రకటించింది. ఇకపై వన్డేల్లో, టి20ల్లో మాత్రమే కొనసాగనున్నట్లు బ్రంట్‌ తెలిపింది. ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కేథరిన్‌ బ్రంట్‌ నిలిచింది. ‌2004లో యాషెస్‌ సిరీస్‌ ద్వారా కేథరిన్‌ బ్రంట్ ఇంగ్లండ్‌ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసింది.

డెబ్యూ మ్యాచ్‌లోనే తొమ్మిది వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తోనూ 52 పరుగులు చేసిన బ్రంట్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతేగాక 42 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ యాషెస్‌ ట్రోపీని రిటైన్‌ చేసుకోవడంలో కేథరిన్‌ బ్రంట్‌ది ముఖ్యపాత్ర. ఇప్పటివరకు కేథరిన్‌ బ్రంట్‌ 14 టెస్టుల్లో 51 వికెట్లు పడగొట్టింది.  


ఇక టెస్టుల్లో రిటైర్మెంట్‌పై బ్రంట్‌ స్పందిస్తూ.. ''గత రెండేళ్ల నుంచి  టెస్టులకు రిటైర్మెంట్‌ ఇవ్వాలని అనుకున్నా. ఒక ఫార్మాట్‌ నుంచి వైదొలుగుతున్నామంటే చెప్పలేని బాధ ఉంటుంది. టెస్టు క్రికెట్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైన ఫార్మాట్‌ నుంచి రిటైర్‌ అవ్వడం అనేది హార్ట్‌ బ్రేకింగ్‌. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.'' అంటూ ఎమోషనల్‌ అయింది.


ఇక ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు బ్రంట్‌ రిటైర్మెంట్‌పై స్పందిస్తూ.. ''ఒక శకం ముగిసింది. ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఉన్న కేథరిన్‌ బ్రంట్‌ ఆటకు గుడ్‌బై చెప్పింది.. నీ సేవలకు సలాం.. థాంక్యూ బ్రంటీ'' అంటూ లవ్‌ ఎమోజీతో ట్వీట్‌ చేసింది.  

చదవండి: Ranji Trophy 2022: బెంగాల్‌పై ఘన విజయం.. 23 ఏళ్ల తర్వాత ఫైనల్లో మధ్యప్రదేశ్‌

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌పై ఆరోపణలు.. లైంగికంగా వేధించడమే గాక స్నేహితులను తీసుకొచ్చి

మరిన్ని వార్తలు