రెండో వన్డేలోనూ ఓడిన మిథాలీ సేన..సిరీస్‌ ఇంగ్లండ్‌ వశం

1 Jul, 2021 16:46 IST|Sakshi

టాంటన్: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్(92 బంతుల్లో 7 ఫోర్లతో 59) అర్ధశతకంతో రాణించినా.. భారత మహిళా జట్టుకు ఓటమి తప్పలేదు. బుధవారం అర్దరాత్రి దాటక ముగిసిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళలు ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టి, టీమిండియాపై 5 వికెట్లతో ఘన విజయం సాధించారు. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్నారు. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన మిథాలీ సేన.. రెండో వన్డేలోనూ అదే తడబాటును కొనసాగించింది. చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు స్మృతి మంధాన(22), షెఫాలీ వర్మ(44) శుభారంభం అందించినా.. మిగతా బ్యాటర్లు దాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. ఓవైపు నుంచి మిథాలీ రాజ్ పోరాడినా.. మరోవైపు ఆమెకు ఎవరూ అండగా నిలవలేదు. జెమీమా రోడ్రిగ్స్(8), హర్మన్ ప్రీత్ కౌర్(19), దీప్తీ శర్మ(5), స్నేహ్ రాణా(5), తానియా భాటియా (2), శిఖా పాండే(2) దారుణంగా విఫలమయ్యారు. చివర్లో టెయిలెండర్లు జూలన్ గోస్వామి(19 నాటౌట్), పూనమ్ యాదవ్(10) విలువైన పరుగులు సాధించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో కేట్ క్రాస్(5/34), సోఫీ ఎక్లెస్టోన్ (3/33) భారత్ పతనాన్ని శాసించారు.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 47.3 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగులు చేసి 15 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఆ జట్టులో ఓపెనర్ లారెన్ విన్‌ఫీల్డ్ హిల్(42), లోయరార్డర్ బ్యాటర్లు సోఫియా డంక్లీ(73 నాటౌట్), కేథరీన్ బ్రంట్(33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. జూలన్ గోస్వామి, శిఖా పాండే, స్నేహ్ రాణా తలో వికెట్ తీశారు. భారత్ పతనాన్ని శాసించిన కేట్ క్రాస్(5/34)‌కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి వన్డే జులై 3న జరుగనుంది. 

మరిన్ని వార్తలు