#Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంచలన నిర్ణయం?

22 Nov, 2023 19:55 IST|Sakshi

Is Rohit Sharma Unlikely To Play T20Is Anymore?: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై అతడు అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్‌కప్‌-2023 ఆరంభానికి ముందే రోహిత్‌ ఈ విషయం గురించి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

దారుణ వైఫల్యం.. విమర్శల వర్షం
కాగా టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో టీమిండియా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్‌ సేన సెమీ ఫైనల్లోనే నిష్క్రమించింది. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సహా సెలక్షన్‌ కమిటీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సెలక్షన్‌ కమిటీని రద్దు చేసింది.

అజిత్‌ అగార్కర్‌ రాక.. 
కొన్ని రోజుల అనంతరం మళ్లీ చేతన్‌ శర్మను చీఫ్‌ సెలక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, చేతన్‌ భారత ఆటగాళ్లను ఉద్దేశించి ఓ స్టింగ్‌ ఆపరేషన్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. అతడు రాజీనామా చేయాల్సి వచ్చింది.

రోహిత్‌కు బదులు హార్దిక్‌ పాండ్యానే
ఈ క్రమంలో మాజీ బౌలర్‌ అజిత్‌ అగార్కర్‌ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే.. గతేడాది వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత రోహిత్‌ అంతర్జాతీయ టీ20లకు దూరంగానే ఉంటున్నాడు. 

అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పగ్గాలు చేపట్టి ముందుకు నడిపిస్తున్నాడు. అయితే, వరల్డ్‌కప్‌-2023 నేపథ్యంలో వన్డేలపై మరింత దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే రోహిత్‌ టీ20లకు దూరంగా ఉన్నాడనే వార్తలు వినిపించాయి.

పనిభారాన్ని తగ్గించుకునే క్రమంలో
ప్రపంచకప్-2023 ముగిసిన తర్వాత హిట్‌మ్యాన్‌ తిరిగి టీ20లు ఆడతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ.. పని భారాన్ని తగ్గించుకునే క్రమంలో రోహిత్‌ అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరంగా ఉందామనే నిర్ణయానికి వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

రోహిత్‌ నిర్ణయమే ఇది
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘ఇది కొత్త విషయమేమీ కాదు. వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీపై ఫోకస్‌ చేసే ఉద్దేశంతో గత ఏడాది కాలంగా రోహిత్‌ టీ20లకు దూరంగా ఉన్నాడు.

ఈ విషయం గురించి ఇప్పటికే సెలక్షన్‌ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌తో కూడా రోహిత్‌ చర్చించాడు. ఇంటర్నేషనల్‌ టీ20లకు దూరంగా ఉండాలనేది తనకు తానుగా తీసుకున్న నిర్ణయం’’ అని పేర్కొన్నాయి. 

ఆ లక్కీ ఛాన్స్‌ ఎవరికో?!
కాగా రోహిత్‌ శర్మతో పాటు యువ బ్యాటర్లు శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైశ్వాల్‌, ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఓపెనర్ల రూపంలో అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే గిల్‌ రోహిత్‌ జోడీగా పాతుకుపోగా.. మిగిలిన వాళ్లు తమను తాము నిరూపించుకున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో సత్తా చాటుతున్నారు.

ఒకవేళ అనుభవమున్న కెప్టెన్‌ కావాలనుకుంటే
ఈ నేపథ్యంలో రోహిత్‌ వర్క్‌లోడ్‌ విషయంలో రాజీపడక టీ20లకు దూరంగా ఉండాలనుకుంటే గిల్‌తో పాటు మరో కొత్త ఓపెనర్‌ను చూసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. టీ20 వరల్డ్‌కప్‌-2024లో అనుభవమున్న కెప్టెన్‌ కావాలని భావిస్తే.. 36 ఏళ్ల రోహిత్‌ అంతర్జాతీయ టీ20లలో కొనసాగాలని.. బీసీసీఐ ఆ దిశగా అతడిని ఒప్పించే ప్రయత్నాలు చేయొచ్చు. 

ఆసీస్‌ సిరీస్‌లో.. సూర్య టీ20 సారథిగా
ఇక వన్డే వరల్డ్‌కప్‌-2023లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న భారత జట్టు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. వైజాగ్‌ వేదికగా నవంబరు 23న ఈ సిరీస్‌ ఆరంభం కానుంది. రోహిత్‌, విరాట్‌ కోహ్లి తదితరులు విశ్రాంతి తీసుకోగా.. హార్దిక్‌ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆసీస్‌తో సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

చదవండి: సొంత బిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు: పాక్‌ లెజెండ్‌

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు