Novak Djokovic US Open 2022 : 'జోకర్‌' ఆడడం కష్టమే.. ఆన్‌లైన్‌లో ఫ్యాన్స్‌ సంతకాల సేకరణ

22 Jul, 2022 17:21 IST|Sakshi

సెర్బియా టెన్నిస్‌ స్టార్‌.. ముద్దుగా 'జోకర్‌' అని పిలుచుకునే నొవాక్‌ జొకోవిచ్‌కు యూఎస్‌ ఓపెన్‌ రూపంలో మరోషాక్‌ తగిలేలా ఉంది. ఇటీవలే ముగిసిన వింబూల్డన్ ట్రోఫీ నెగ్గడం ద్వారా 21 గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన జొకోవిచ్.. యూఎస్ ఓపెన్‌లో ఆడి స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్ రికార్డు (22)ను సమం చేయాలని భావిస్తున్నాడు. అయితే కరోనా వ్యాక్సిన్‌ విషయంలో మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న జొకోవిచ్‌కు మరో గండం పొంచి ఉంది. గురువారం విడుదలైన డ్రా లో జొకోవిచ్ పేరు ఉన్నప్పటికీ అతడు ఈ టోర్నీ ఆడేది అనుమానంగానే ఉంది. వ్యాక్సిన్ వేసుకోనివారిపై నిషేధం లేకున్నా అమెరికా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు మెలిపెట్టడంతో జొకోవిచ్ ఈ టోర్నీ ఆడటం కష్టమేనంటూ వార్తలు వస్తున్నాయి.

యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో.. ‘ఈ టోర్నీలో వ్యాక్సిన్ వేసుకున్నవారినే అనుమతించాలన్న ఆదేశాలేం లేవు. కానీ మా ప్రభుత్వ విధానం ప్రకారం మేం నడుచుకుంటాం..’ అని తెలిపింది. అగ్రరాజ్య ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. యూఎస్ పౌరులు మినహాయించి వ్యాక్సిన్ వేసుకోని వారికి దేశంలో ప్రయాణం చేసే ఆస్కారం లేదు. దీంతో జొకోవిచ్‌కు ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా ఓపెన్‌ (కరోనా వ్యాక్సిన్ వేసుకోలేదని ఈ టోర్నీ ఆడనివ్వలేదు)లో ఎదురైన అనుభవమే మళ్లీ ఎదుర్కోక తప్పదని వాదనలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జొకోవిచ్ అభిమానులు ఆన్‌లైన్ పిటిషన్ క్యాంపైన్ స్టార్ట్ చేశారు. జొకోవిచ్‌ను యూఎస్ ఓపెన్‌లో ఆడించాలని కోరుతూ ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఇప్పటివరకు సుమారు 12 వేల మందికి పైగా దీనిలో సంతకాలు చేశారు. మరి జొకోవిచ్ విషయంలో అమెరికా ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందోనని అతడి అభిమానులతో పాటు టెన్నిస్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆగస్టు 27 నుంచి యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది.  

అయితే మొదటినుంచి కరోనా వ్యాక్సిన్ వేసుకొనంటూ మొండి పట్టు పట్టిన ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్‌ స్టార్‌కు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో భంగపాటే ఎదురైంది. కోర్టు మెట్ల వరకు సాగిన వివాదంలో తీర్పు చివరకు జొకోవిచ్‌కు వ్యతిరేకంగానే వచ్చింది.  వ్యాక్సిన్‌ వేసుకునేందుకు నిరాకరించిన జోకోవిచ్‌పై ఆసీస్‌ ప్రభుత్వం మూడేళ్లపాటు నిషేధం విధించింది. ఒక రకంగా జొకో కెరీర్‌లో ఈ ఉదంతం మాయని మచ్చ అని చెప్పొచ్చు.

చదవండి: World Athletics Championship: 'నా కొడుకు ప్రపంచ చాంపియన్‌.. గర్వంగా ఉంది'

మరిన్ని వార్తలు