IND Vs ENG 3rd Test: రోహిత్ శర్మ ఎల్బీపై ఫ్యాన్స్ ఫైర్!

28 Aug, 2021 16:22 IST|Sakshi

లీడ్స్‌: లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో  జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ‌ ఔటైన తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో బంతిని లెగ్ సైడ్‌ ఆడేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి తగలకుండా బంతి నేరుగా వెళ్లి ఫ్యాడ్‌ని తాకింది. వెంటనే ఇంగ్లండ్ టీమ్ ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఔటిచ్చాడు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రోహిత్ వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రిప్లైలో ఆఫ్ స్టంప్‌ లైన్‌పై పడిన బంతి లెగ్‌ స్టంప్‌ని కొద్దిగా తాకుతూ వెళ్లేలా కనిపించింది.

దాంతో టీవీ అంపైర్ దానిని అంపైర్స్ కాల్గా ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ తన మునుపటి ఔట్ నిర్ణయానికే కట్టుబడ్డాడు. అంపైర్స్ కాల్ నిర్ణయంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, నియమం ప్రకారం కనీసం 50 శాతం బంతి స్టంప్స్‌ని తాకాలి, కానీ అభిమానులు కేవలం 10-20 శాతం మాత్రమే వికెట్‌ను తాకినట్లు  భావిస్తున్నారు.  అంపైర్ ఔట్‌ ఇవ్వకపోయి ఉంటే అది అవుట్ అయ్యేది కాదని .. అంపైర్ కాల్ నియమం వింతగా ఉందని అభిమానులు మండిపడుతున్నారు.

ఈ నిర్ణయం పట్ల రోహిత్ అసహనం వ్యక్తం చేస్తూనే మైదానం వీడాడు. తొలి ఇన్నింగ్స్‌ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్‌మెన్‌ రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 59) రాణించగా, చతేశ్వర్‌ పుజారా(180 బంతుల్లో 15 ఫోర్లతో 91) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. కెప్టెన్‌ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్‌) క్రీజులో పాతుకుపోయాడు. ప్రస్తుతం భారత్‌ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది.

చదవండి:IND Vs ENG 3rd Test Day 4: అనుకున్నదే జరిగింది.. ఆదిలోనే పుజారా(91) ఔట్‌

>
మరిన్ని వార్తలు