ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డు రేసులో మహ్మద్‌ షమీ..

7 Dec, 2023 19:08 IST|Sakshi

నవంబర్‌ నెలకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్‌లిస్ట్‌ చేసింది.

ఈ లిస్ట్‌లో వన్డే వరల్డ్‌కప్‌-2023 హీరోలు టీమిండియా వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ, ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌, ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఉన్నారు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో వీరిముగ్గురు దుమ్మురేపారు. 

మహ్మద్‌ షమీ..
వన్డే ప్రపంచకప్‌ టోర్నీ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా షమీ నిలిచాడు. ఈ మెగా టోర్నీలో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ.. 24 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడిని ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డుకు ఐసీసీ నామినేట్‌ చేసింది.
ట్రావిస్‌ హెడ్‌..
ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలవడంలో ట్రావిస్‌ హెడ్‌ది కీలక పాత్ర. భారత్‌తో జరిగిన ఫైనల్లో హెడ్‌ 137 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ టోర్నీలో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన హెడ్‌.. 44 సగటుతో 220 పరుగులు చేశాడు.

గ్లెన్‌ మాక్స్‌వెల్‌..
వన్డే వరల్డ్‌కప్‌తో పాటు టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో మాక్స్‌వెల్‌ దుమ్మురేపాడు. ప్రపంచకప్ టోర్నీలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర డబుల్‌ సెంచరీతో మాక్సీ చెలరేగాడు. ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను ఒంటి చేత్తో మాక్సీ గెలిపించాడు. అదే విధంగా గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో కూడా ​మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు.
చదవండి: T20 WC 2024: టీ20 వరల్డ్‌కప్‌కు కోహ్లి దూరం.. విధ్వంసకర ఆటగాడికి ఛాన్స్‌!?

>
మరిన్ని వార్తలు