FIFA WC 2022: యువ సంచలనం.. రొనాల్డోను తప్పించి జట్టులోకి తీసుకువస్తే! ఏకంగా 3 గోల్స్‌తో..

7 Dec, 2022 13:27 IST|Sakshi
గొంకాలో రామోస్‌ (PC: FIFA World Cup Twitter)

స్విట్జర్లాండ్‌పై అద్భుత విజయంతో క్వార్టర్స్‌లో పోర్చుగల్‌

FIFA World Cup 2022 Portugal Vs Switzerland: స్విట్జర్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో పోర్చుగల్‌ ఫుట్‌బాలర్‌ గొంకాలో రామోస్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరిసి ఫిఫా వరల్డ్‌కప్‌-2022 టోర్నీలో ఇప్పటి వరకు ఈ ఫీట్‌ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. తద్వారా బుధవారం నాటి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

రొనాల్డోను తప్పించి..
21 ఏళ్ల రామోస్‌ మూడు గోల్స్‌(17, 51, 67వ నిమిషంలో) సాధించి జట్టును గెలిపించాడు. తద్వారా పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోను బెంచ్‌కు పరిమితం చేసి.. అతడి స్థానంలో తనను తీసుకువచ్చిన కోచ్‌ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక రామోస్‌కు తోడు.. కెప్టెన్‌ పీప్‌, రాఫేల్‌ గెరీరో, రాఫేల్‌ లియో రామోస్‌ గోల్స్‌ చేయడంతో పోర్చుగల్‌ స్విస్‌ను 6-1తో చిత్తుగా ఓడించి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.

ముచ్చటగా మూడోసారి
స్విస్‌ ఆటగాళ్లలో మాన్యూల్‌ అకంజీ ఒక గోల్‌ సాధించాడు. కాగా ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలో పోర్చుగల్‌ క్వార్టర్స్‌కు చేరడం ఇది మూడో సారి. గతంలో 1966, 2006లో ఈ ఫీట్‌ సాధించింది. ఇక క్వార్టర్స్‌ ఫైనల్లో పోర్చుగల్‌.. మొరాకోతో తలపడనుంది.

రొనాల్డో ఫ్యాన్స్‌ ఆగ్రహం
ఈ మ్యాచ్‌ సెకండాఫ్‌లో (74వ నిమిషంలో) రొనాల్డో మైదానంలోకి వచ్చాడు. జొయావో ఫెలిక్స్‌కు సబ్‌స్టిట్యూట్‌గా రొనాల్డోను తీసుకువచ్చారు. ‍ఈ నేపథ్యంలో రొనాల్డో అభిమానులు కోచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు